50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడమే గొప్ప విషయంగా అందరూ భావిస్తుంటారు. అలాంటిది 'ఉప్పెన' చిత్రంలోని 'నీ కన్ను నీలి సముద్రం' పాట నమ్మశక్యం కాని ఘనతను సాధించింది. ఈ శ్రావ్యమైన రొమాంటిక్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సందర్భవశాత్తూ, ఇదే రోజు ఆ పాటకు బాణీలు కూర్చిన సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ బర్త్‌డే కావడం విశేషం.
డీఎస్పీ అంటే మాస్ బీట్స్‌కు పెట్టింది పేరు. కానీ వినసొంపైన బాణీలు కూర్చడంలో ఎప్పటికప్పుడు తను మాస్టర్‌నని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. కొంత కాలంగా 'నీ కన్ను నీలి సముద్రం' పాట సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తూ, 'ఉప్పెన' చిత్రంపై అంచనాలను పెంచుతూ వస్తోంది.
ఈ ఖవ్వాలీ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడై మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తోంది. అలాగే పాటలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ల ఎక్సెప్రెషన్స్ ముచ్చటగా అనిపిస్తున్నాయి. ఈ పాటకు శ్రీమణి, రఖీబ్ ఆలమ్ చక్కని సాహిత్యం అందించారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సానాకు మ్యూజిక్‌పై ఉన్న అభిరుచి, పాటలను అతను ప్రెజెంట్ చేసిన విధానం ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. మరో పాట 'ధక్ ధక్ ధక్' ఇప్పటివరకూ 18 మిలియన్ వ్యూస్ పైగా సాధించడం గమనార్హం. దర్శకత్వం వహించడంతో పాటు ఉప్పెనకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను బుచ్చిబాబు అందించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధంగా ఉన్నారు.