అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లుగా కొద్ది రోజుల నుంచి ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పుష్ప చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం వాస్తవమే అని ఆయన ధ్రువీకరించారు. దీనిపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ తో కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్ వెల్లడించారు.
“ఎంతో స్పాన్ ఉన్న ‘పుష్ప’ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తో చర్చించి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. మొదటి భాగం పూర్తి కాగానే రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేస్తాం. రెండో భాగం కోసం అనుకున్న కథలో ఇప్పటికే 10 శాతం షూటింగ్ పూర్తయింది” అని రవిశంకర్ చెప్పారు.
కాగా, ‘బాహుబలి’ తర్వాత రెండు భాగాలుగా విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప’ కావడం గమనార్హం. బాహుబలి కూడా ఇలాగే ఒక సినిమాగా మొదలై, మేకింగ్ మధ్యలో ఉండగా రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.