'జోడీ' సినిమాలో సిమ్రాన్ పక్కన స్నేహితురాలి పాత్రలో తొలిసారి వెండితెరపై తళుక్కుమన్న తమిళ భామ త్రిష కృష్ణన్. తమిళంలో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా, అవి అనువాదాల రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించినా, ఈ భామకు 2004లో విడుదలైన 'వర్షం' తెలుగులో అభిమాన వర్షాన్ని కురిపించింది. అవకాశాల తుఫానులను సృష్టించింది. అప్పట్నుంచీ చాలా కాలం దాకా ఈ తమిళ పొన్నుకు తిరిగి చూసుకునే అవసరమే రాలేదు.
అయినా ఈమె తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పుకోలేదు. "నేను డబ్బింగ్ చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. షూటింగ్‌లకు కాల్షీట్లు సర్దడానికి నాకు డైరీ సరిపోయేది. అయినా డబ్బింగ్‌ను నమ్ముకొని కొంతమంది కళాకారులున్నప్పుడు వారి పొట్టకొట్టడం నాకిష్టం లేదు. అందుకే ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నించలేదు." అని తాను డబ్బింగ్ ఎందుకు చెప్పుకోలేదో వివరించింది త్రిష.
ప్రస్తుతం ఈ సుందరి నాలుగు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం చేస్తోంది. వాటిలో మణిరత్నం డైరెక్షన్లో చేస్తోన్న 'పొన్నియన్ సెల్వన్' మూవీ కూడా ఉంది. అందులో ఆమె చోళ రాజకుమారి కుందవి పాత్రను పోషిస్తోంది. 'గర్జనై', 'రాంగి' అనే థ్రిల్లర్స్‌తో పాటు అరవింద్ స్వామితో 'శతురంగ వేట్టై 2' మూవీ చేస్తోంది త్రిష. అలాగే 'దృశ్యం' ఫేమ్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తోన్న మలయాళం మూవీ 'రామ్'లో మోహన్ లాల్ సరసన నటిస్తోంది. తెలుగులో 2016లో చేసిన 'నాయకి' తర్వాత ఇంతదాకా మరో సినిమాని ఆమె అంగీకరించలేదు.