సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'శాకుంతలం' విడుదలకు ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కూడా రిలీజ్ కావడంతో.. ఆ తేదీకే ఈ సినిమా వస్తుందని భావించారంతా. అయితే ఇప్పుడు మరోసారి సినిమా విడుదల తేదీని మార్చాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి గుణ టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఏవో కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. కొన్ని వాయిదాల తర్వాత గతేడాది నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ 3Dలో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా వస్తున్నామని చివరి నిమిషంలో ప్రకటించారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా అనుమానమే అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం, ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లోని వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రం ఫిబ్రవరి 17కి బదులుగా వేసవిలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.