ప్రస్తుతం మన దేశంలో అర్థ శతదినోత్సవాలు లేవు. ఇక శతదినోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ చిత్రాలు కనుమరుగై చాలా కాలం అయింది. నేటి రోజుల్లో ఓ బ్లాక్ బస్టర్ చిత్రం నెల రోజులు థియేటర్లలో ఆడటం అంటే గొప్ప. నెలరోజులు కూడా థియేటర్లలో ఆడటం అంటే గగనమైపోయింది. మొదటి వారంలోని సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే మరో రెండు మూడు వారాలు అంతే. ఆ తరువాత థియేటర్ల నుంచి వెళ్ళిపోతున్నాయి. సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాలు థియేటర్లో ఉండటం కష్టమైంది. 50 రోజులు ఆడుతున్న సినిమాలు ఎప్పుడో పోయాయి. అలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకోవడం అందునా అది కూడా జపాన్లో కావడం విశేషం. దీన్ని ఒక అద్భుతం అని చెప్పాలి. విదేశాలలో మన సినిమాలు అడపా తడపా విడుదల అవుతూ ఉంటాయి. మొదటి వారం, రెండో వారం వరకు వసూలు రాబడుతూ ఉంటాయి.
కానీ వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన దాఖలాలు లేవు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. జపాన్లో 42 కేంద్రాలలో డైరెక్ట్ వంద రోజులుగా 114 కేంద్రాల్లో షిఫ్ట్ పద్ధతిలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం మన దేశంలో అందునా తెలుగులో కూడా శతదినోత్సవం జరుపుకోలేదు. అలాంటిది ఏకంగా జపాన్ లో ఈ చిత్రం ఈ స్థాయిలో థియేటర్లలో విడుదలై ఆడిందంటే దానిని అద్భుతం అనక తప్పదు. వంద రోజులు అంటే ఊహకే అందడం లేదు.
జపాన్ లో వంద రోజులు పూర్తి చేసుకోవడం ఓ అద్భుతమైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇది ఆస్కార్ కంటే మనకు లభించిన అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో అమితాబ్ బచ్చన్ నటించిన షోలే చిత్రం అక్కడ అన్నిరోజులు ఆడింది..... ఇక్కడ ఇన్ని రోజులు ఆడింది అని అనుకోవడం మినహా మనం వినడం తప్ప చూసింది లేదు. కానీ ఇంతకాలానికి ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్లో ఈ స్థాయిలో ఆడిందనే దానికి మనమే భావితరాలకు సాక్ష్యంగా నిలుస్తామని చెప్పాలి.