టాలీవుడ్ యువ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల నాగశౌర్య బెంగళూరుకి చెందిన అనూష శెట్టిని పెళ్లాడాడు. అలాగే శర్వానంద్ కు రక్షిత రెడ్డితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి మెగా బ్రదర్ నాగబాబు రివీల్ చేయడం విశేషం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు తన తనయుడు వరుణ్ తేజ్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని అన్నారు. అయితే పెళ్లి కూతురు ఎవరనే విషయం ఇప్పుడే చెప్పలేనని, త్వరలో వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపారు. పెళ్లి తర్వాత వరుణ్ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడని చెప్పారు. వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ, మానసికంగా తామంతా కలిసే ఉంటామని నాగబాబు చెప్పుకొచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే ఓ వ్యాపారవేత్త కుమార్తెను కూడా పెళ్లాడబోతున్నట్లు కూడా గతంలో వార్తలొచ్చాయి. మరి వరుణ్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.