మోహన్‌లాల్‌తో రూపొందించిన 'ఓడియన్' (2018) మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన వి.ఎ. శ్రీకుమార్ మీనన్ ఓ చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. 2006 నుంచి ఇప్పటిదాకా జరిగిన నగదు బదలాయింపులకు సంబంధించి శ్రీకుమార్‌పై శ్రీవాల్సమ్ బిజినెస్ గ్రూప్‌కు చెందిన రాజేంద్రన్ పిళ్లై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, ఒక సినిమా తీసే నిమిత్తం శ్రీకుమార్ తన నుంచి రూ. 7 కోట్లు తీసుకున్నాడనీ, కానీ ఇంతదాకా ఆ సినిమా మొదలు కాలేదనీ రాజేంద్రన్ పిళ్లై ఆరోపించారు. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఫిర్యాదు చేయడం ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మే 6న శ్రీకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అలప్పుళ సౌత్ పోలీస్ స్టేషన్‌లో అతడిని విచారించారు. అతనిపై ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద చార్జ్‌షీట్ దాఖలు చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం శ్రీకుమార్ దరఖాస్తు చేసుకోగా, కోర్టు తిరస్కరించింది.
ఈ తరహా వ్యవహారాలతో వార్తల్లోకెక్కడం శ్రీకుమార్‌కు ఇదే తొలిసారి కాదు. ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ప్రచారం ద్వారా తన పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ అతనిపై 2019లో మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కేసు పెట్టారు. అప్పుడు కూడా అరెస్టయిన శ్రీకుమార్, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. 'ఓడియన్' మూవీలో మంజు నాయికగా నటించారు.