ప్రముఖ నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ మల్టిపుల్ బ్లాక్స్‌ను తొలగించుకోడానికి ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకుని, కోలుకుంటున్నారు. తన గుండె శస్త్రచికిత్సకు ముందు, ఆయన కోవిడ్-19 నుండి కోలుకున్నారు. తాము కోవిడ్-19ను, హర్ట్ సర్జరీని ఒకదాని తర్వాత ఒకటిగా ఎలా ఎదుర్కొన్నారో ఒక సుదీర్ఘ నోట్ ద్వారా ఆయన కుమార్తె కీర్తి పాండ్యన్ షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ తమలో వస్తున్న లక్షణాలను గమనిస్తుండాలనీ, వాటిని విస్మరించవద్దనీ ఆమె కోరారు.
కీర్తి పాండ్యన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆసుపత్రి నుండి అరుణ్ పాండ్యన్ నవ్వుతున్న ఫోటోను, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక సుదీర్ఘ నోట్‌ను షేర్ చేశారు. ప్రారంభంలో, ఆమె తండ్రికి తేలికపాటి ఛాతీ నొప్పి, అసౌకర్యం లక్షణాలు కనిపించాయని ఆమె వెల్లడించారు. కానీ, టెస్ట్ చేయించుకోడానికి వెళ్ళినప్పుడు, ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
అరుణ్ పాండ్యన్ కోవిడ్ 19 చికిత్స తీసుకొని కోలుకోగా, మిగిలిన కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్-19 నెగటివ్‌గా టెస్ట్‌లో తేలిన తర్వాత, అరుణ్ పాండియన్ ఎకోకార్డియోగ్రాఫర్‌ను సంప్రదించి, తన గుండెను చెక్ చేయించుకున్నారు. అప్పుడు ఆయనకు మల్టిపుల్ బ్లాక్స్ వున్నాయనే విషయం వెల్లడైంది. వెంటనే వాటిని తొలగించాలని డాక్టర్ సూచించారు. సర్జీరీ అనంతరం అరుణ్ పాండియన్ ప్రస్తుతం బాగానే ఉన్నారు, బాగా కోలుకుంటున్నారు. తన తండ్రిని జాగ్రత్తగా చూసుకున్న వైద్యులకు కూడా కీర్తి కృతజ్ఞతలు తెలిపారు.
కీర్తి పాండ్యన్, ఆమె తండ్రి అరుణ్ పాండ్యన్ కలిసి చివరిసారిగా 'అన్బిర్కినియల్' మూవీలో కనిపించారు, ఇది అన్నా బెన్ నటించిన మలయాళ హిట్ చిత్రం 'హెలెన్'కు తమిళ రీమేక్. 'అన్బిర్కినియల్' థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.