![]() |
![]() |

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి అగ్రతారాల్లో ఒకరైన జమున కన్నుమూశారు. సత్యభామ పాత్రతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఆమె వయోభారం వలన కలిగిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. ఐదు దశాబ్దాలకు మించిన కెరీర్లో 200కు పైగా చిత్రాల్లో ఆమె భిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలోనూ నటించిన జమున 1936లో హంపిలో జన్మించారు. 1953లో వచ్చిన 'పుట్టిల్లు' సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఎల్.వి.ప్రసాద్ డైరెక్ట్ చేయగా 1955లో వచ్చిన 'మిస్సమ్మ' చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి దిగ్గజాల సరసన ఆమె నటించారు. ఆ సినిమా తర్వాత నటిగా ఆమె వెనుతిరగాల్సిన అవసరం కలుగలేదు. ఇదే కాంబినేషన్ తో వచ్చిన 'గుండమ్మ కథ' కూడా సూపర్ హిట్ అయ్యి జమునకు మంచి పేరు తెచ్చింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన శ్రీకృష్ణతులాభారం శ్రీకృష్ణ విజయం, వినాయక చవితి లాంటి చిత్రాల్లో సత్యభామగా జమున అభినయం ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. అందుకే వెండితెర సత్యభామ అంటే జమున మాత్రమే మనకు గుర్తుకు వస్తారు. అంతగా ఆ పాత్రకు ఆమె వన్నె తెచ్చారు.
'మంగమ్మ శపథం', 'మనుషులంతా ఒక్కటే' చిత్రాల్లో రామారావుకు ధీటుగా ఆమె నటన అద్భుతం. ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ప్రేమ కావ్యం 'మూగమనసులు'లో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించినప్పటికీ జమున చేసిన రెండో కథానాయక గౌరీ పాత్ర మనకు బాగా గుర్తుండిపోయింది. అది ఆమె నటనలోని గొప్పతనం. అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, హరనాథ్, కృష్ణ, శోభన్ బాబు తదితరుల సరసన ఆమె నటించారు.
ఆత్మాభిమానం మెండుగా ఉన్న నటిగా ఆమెను చెప్పుకొనేవారు. హీరోలకు సమానంగా తమకు గౌరవం ఇవ్వాలని ఆమె చెప్పేవారు. ఇలాంటి విషయంలోనే మధ్యలో కొంతకాలం రామారావు నాగేశ్వరరావులతో వచ్చిన విభేదాల కారణంగా వారి సరసన నటించే అవకాశం రానప్పుడు హరనాథ్ జంటగా పలు చిత్రాల్లో ఆమె నటించారు. అలా వారి జంట కూడా హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. చలనచిత్ర సీమకు చేసిన సేవకు గుర్తింపుగా 2008లో ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు.
1965లో రమణారావుతో ఆమెకు వివాహమైంది. ఆయన 2014లో మృతి చెందారు. రాజకీయరంగంలోనూ అడుగు పెట్టిన జమున 1989లో రాజమండ్రి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 1991 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి నిలబడి ఓటమి చవి చూశారు. తర్వాత కాలంలో ఆమె బిజెపిలో చేరారు.
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర సీమలో వరుస మరణాలు సంభవిస్తూ అభిమానుల హృదయాలను శోకతప్తుల్ని కావిస్తున్నాయి. గత ఏడాది కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, చలపతిరావు, రమేష్ బాబు తదితరులను చిత్రసీమ కోల్పోయింది. ఇప్పుడు అలనాటి లెజెండరీ యాక్ట్రెస్ జమున మరణంతో చిత్రసీమలో మరోసారి విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణానికి పలువురు చిత్ర సీమ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
జమున నటించిన చక్కని చిత్రాల్లో కొన్ని.. మిస్సమ్మ, గుండమ్మ కథ, ఇల్లరికం, లేత మనసులు, అప్పుచేసి పప్పుకూడు, మూగమనసులు, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణతులాభారం, గులేబకావళి కథ, సంసారం, మంగమ్మ శపథం, ఆడజన్మ, రాముడు భీముడు, ధనమా దైవమా, కురుక్షేత్రం, పెళ్లినాటి ప్రమాణాలు, ఏకవీర, కటకటాల రుద్రయ్య, మనుషులంతా ఒక్కటే, పండంటి కాపురం
![]() |
![]() |