![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి జమున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల జమున హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జమున 1936 ఆగష్టు 30న హంపీలో జన్మించారు. ఆమె తండ్రి వ్యాపార నిమిత్తం గుంటూరు జిల్లా దుగ్గిరాలకు రావడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది. సినీనటుడు జగ్గయ్యదీ అదే ప్రాంతం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది. జమున స్కూలులో చదివే సమయంలోనే నాటకాల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఒకసారి తెనాలి సమీపంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళారు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన 'పుట్టిల్లు' ఆమె తొలిచిత్రం. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు(1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించారు.
జమున నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ వంటి చిత్రాలు విజయవంతమయ్యి రజతోత్సవం జరుపుకున్నాయి. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించారు. దాదాపు 200 సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోనూ ఆమె రాణించారు. 1989లో రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న జమున 2008లో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు.
![]() |
![]() |