విజయనగరంలో ఎనిమిదో తరగతి (అప్పట్లో థర్డ్ ఫారమ్) చదువుకునే రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో రావి కొండలరావు పనిచేశారు. అందులో 'ఘట్ నాయక్'గా ఎదిగారు. 1948లో మహాత్మా గాంధీని హత్యచేసిన నాధూరామ్ గాడ్సే హిందూ మహాసభకు చెందిన వాడనీ, ఆ సభతో ఆర్ ఎస్ ఎస్‌కు అనుబంధం ఉందనే ఉద్దేశంతో ఆ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించి ఆర్ ఎస్ ఎస్‌కు అనుకూలంగా ప్రదర్శన చేసినందుకు మూడు నెలల జైలుశిక్ష అనుభవించారు కొండలరావు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని లైబ్రరీలో పుస్తకాలు చదవడంలో ఆయనలోని రచయిత మేల్కొన్నాడు. అనేక నాటికలు, కథలు రాశారు.
మద్రాసులో ముళ్లపూడి వెంకటరమణ గారింట్లో ఆశ్రయం పొందినప్పుడు సినిమా రంగంలోకి రమ్మనమని ఆయన ప్రోత్సహించారు. రచయిత డి.వి. నరసరాజు పొన్నలూరి బ్రదర్స్ సంస్థలో అవకాశం కల్పించారు. అక్కడ స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండగా కమలాకర కామేశ్వరరావు ప్రోత్సాహంతో అదే సంస్థలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి మారారు. 'శోభ' (1958) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే ఆ సినిమాలో ఓ వేషం వేశారు. అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రూ. 150 జీతం వస్తుండేది. దానితో జీవితం గడవడం కష్టంగా ఉండటంతో ఫుల్‌టైమ్ యాక్టర్‌గా మారమని బాపు రమణలు సూచించారు. గుత్తా రామినీడు డైరెక్ట్ చేసిన 'బంగారు సంకెళ్లు' చిత్రంలో మంచి వేషం దొరికింది. ఆ వెంటనే ముళ్లపూడి వారు రచన చేసిన 'దాగుడు మూతలు' సినిమాలో నటించారు కొండలరావు.
నటి రాధాకుమారి కుటుంబంతో కొండలరావు తల్లికి మంచి పరిచయం. అందువల్ల కొండలరావు ఇంట్లోనే ఎక్కువగా ఆమె తిరుగుతుండేది. ఆమెతో కలిసి తిరుగుతుంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని రమణగారు అనడంతో రాధాకుమారి అభిప్రాయం తెలుసుకొని ఆమెను పెళ్లాడారు.
తన జీవిత కాలంలో వంద వరకు రేడియో నాటికలు, 25 స్టేజి నాటికలు, అరవైకి పైగా కథలు రాశారు కొండలరావు. మాయాబజార్, మల్లీశ్వరి, షావుకారు, పాతాళభైరవి సినిమాలకు సినిమా నవలలు తీసుకొచ్చారు. బాపు సినిమా 'పెళ్లి పుస్తకం' కథా రచయిత ఆయనే. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన 'బృందావనం', 'భైరవద్వీపం' చిత్రాలకు ఆయన డైలాగ్స్ రాశారు.
నటునిగా పేరు తెచ్చిన చిత్రాలు:
బంగారు సంకెళ్లు, దాగుడు మూతలు, శ్రీకృష్ణ విజయం, శ్రీమంతుడు, దసరా బుల్లోడు, అందాల రాముడు, ఇదెక్కడి న్యాయం, రాధా కల్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయ్, సాహసం చేయరా డింభకా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లి పుస్తకం, బృందావనం, మేడమ్, శ్రీకృష్ణార్జున విజయం, మీ శ్రేయోభిలాషి.