సడన్గా అదా శర్మ ప్రధాన పాత్రలో టైటిల్ ఖరారు చేయని ఓ సినిమా ప్రకటన వచ్చింది. చాలామందికి అది షాక్ ఇచ్చింది. ఎందుకంటే... దర్శక, నిర్మాతలు పెద్దగా పేరున్నవారు కాదు. 'క్షణం', 'కల్కి' విజయాల తరవాత, హిందీలో 'కమాండో 3' తరవాత చిన్న సినిమా చేయడానికి ఎలా అంగీకరించిందో చాలామందికి అంతుచిక్కలేదు. అదా శర్మ కెరీర్ ఫెడవుట్ స్టేజికి వచ్చిందని కొన్ని కామెంట్లు కూడా వినిపించాయి.
అదా శర్మ మాత్రం 'కల్కి' తరవాత కొన్ని ఆఫర్లు వచ్చాయనీ, ఆయా కథలలో పాత్రలు నటిగా నాకు సంతృప్తి కలిగించలేదనీ, కొత్తదనం లేని కారణంగా రిజెక్ట్ చేశానని చెబుతున్నారు. ఇప్పుడు తనకోసం కొంతమంది రైటర్లు, ఫిలింమేకర్లు ప్రత్యేకంగా కథలు రాసుకుని రావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మంచి కథలు ఎంపిక చేసుకున్న ప్రతిసారీ తెలుగు, హిందీ ప్రేక్షకులకు తనను ప్రశంసించారనీ, తెలుగులో ప్రారంభమైన కొత్త సినిమా చూశాక ప్రేక్షకులు ప్రశంసిస్తారని అదా శర్మ ధీమాగా చెబుతున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు.