రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన వన యజ్ఞం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లక్షలాది మంది గుండెలను తాకుతోంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన యలమంచి రవిశంకర్ ఇచ్చిన పిలుపును స్వీకరించిన టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మంగళవారం చెన్నైలోని తన నివాసంలో తన తల్లితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం, తన స్నేహితులు చెన్నై బ్యూటీ శ్రుతిహాసన్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లకు హరిత సవాల్ విసిరారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్‌ను మనసారా అభినందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా డీఎస్పీ తెలియజేసారు. ఆయన చొరవకు సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క పిలుపునందుకొని మొక్కలు నాటి కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు తమను నామినేట్ చేయడంపై హారీశ్ శంకర్, శ్రుతీహాసన్ స్పందించారు. త్వరలోనే ఆ చాలెంజ్‌లో భాగస్వాములమవుతామని తెలిపారు.