English | Telugu
యోధుడిలా నిఖిల్.. 'స్వయంభు' ఫస్ట్ లుక్ అదిరింది
Updated : Jun 1, 2023
టాలీవుడ్ లో మరే యంగ్ హీరోకి సాధ్యంకాని విధంగా వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. గతేడాది 'కార్తికేయ-2' తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నిఖిల్.. ఈ జూన్ 29న 'స్పై' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే ఇటీవల 'ది ఇండియా హౌస్' అనే ఓ పాన్ ఇండియా ఫిల్మ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందు మరో పాన్ ఇండియా సినిమాతో అలరించనున్నాడు.
ఈరోజు(జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'స్పై' తర్వాత ఆయన నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఇది నిఖిల్ కెరీర్ లో 20వ సినిమా. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. నిఖిల్ పుట్టినరోజు కానుకగా ఈరోజు సాయంత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకి 'స్వయంభు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ లో చేతిలో బల్లెంతో యుద్ధభూమిలో పోరాడుతున్న యోధుడిలా నిఖిల్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ హిస్టారికల్ వార్ ఫిల్మ్ తో నిఖిల్ సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.