English | Telugu
ఒకే దర్శకుడితో గీతా ఆర్ట్స్ మూడు సినిమాలు!
Updated : Jun 1, 2023
టాలీవుడ్ లో ఉన్న ప్రతిభ గల దర్శకులలో చందు మొండేటి ఒకరు. 'కార్తికేయ'తో దర్శకుడిగా పరిచయమైన చందు, మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. రెండో సినిమా 'ప్రేమమ్'తోనూ ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత చేసిన 'సవ్యసాచి'తో మాత్రం నిరాశపరిచారు. ఇక గతేడాది 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకొని తన ప్రతిభ చాటుకున్న చందు, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో వరుసగా మూడు సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.
'కార్తికేయ 2' తర్వాత చందు మొండేటి చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మొదట్లో 'కార్తికేయ 3' చేస్తాడని వార్తలు వినిపించినప్పటికీ, దానికి ఇంకా సమయం ఉందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక నాగచైతన్యతో ఇప్పటికే 'ప్రేమమ్', 'సవ్యసాచి' సినిమా చేసిన చందు.. మూడోసారి ఆయనతో చేతులు కలబోతున్నారని, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుందని కొద్దిరోజులుగా న్యూస్ వినిపిస్తోంది. అయితే తాజాగా చందు మొండేటి తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది.
మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ '2018'ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా థాంక్యూ మీట్ ని నిర్వహించగా, దీనికి అల్లు అరవింద్, చందు మొండేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ తన తదుపరి మూడు సినిమాలు అల్లు అరవింద్ గారి నిర్మాణంలోనే ఉంటాయని చెప్పారు. రామ్ చరణ్, నాగ చైతన్య, హృతిక్ రోషన్, సూర్య వంటి హీరోల కోసం కథలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అరవింద్ గారు ఎవరితో ముందు సినిమా చేయమంటే, వారితో ఉంటుందని చందు చెప్పుకొచ్చారు.
అల్లు అరవింద్ సైతం చందు మొండేటి గీతా ఆర్ట్స్ లో మూడు చేయనున్నాడని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కథలు లాక్ అయ్యాయని, అందులో ఒకటి రూ.200-300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలిపారు. చందు, అరవింద్ మాటలను బట్టి చూస్తే.. చైతన్యతో ఒక సినిమాతో పాటు, రామ్ చరణ్ లేదా హృతిక్ రోషన్ లేదా సూర్యతో భారీ బడ్జెట్ తో మూవీ ఉండే అవకాశముందని అర్థమవుతోంది.
గీతా ఆర్ట్స్ లో రూపొందనున్న ఇతర సినిమాల గురించి కూడా అప్డేట్ ఇచ్చారు అల్లు అరవింద్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని అరవింద్ అన్నారు. కాగా, సురేందర్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ తో ఉండే అవకాశముందని ఇన్ సైడ్ టాక్.