టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి ఫీల్ గుడ్ చిత్రాలను తీసి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన నానితో చేసిన టక్ జగదీష్ మాత్రం పరాజయం పాలయ్యింది. ఆయన ఇటీవల విజయ్ దేవరకొండ -సమంత జంటగా ఖుషి అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే సమంత అనారోగ్యం పాలయ్యింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ప్రస్తుతం సమంత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఆమె నటిస్తున్న శాకుంతలం చిత్రం కూడా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఆ తరువాత శివ నిర్వాణ ఒక డేట్ ను ఫిక్స్ చేసి ఇప్పటికే సమంతాను షూటింగ్‌లో జాయిన్ కమ్మని కోరాడట. సమంత కనుక ఆ సమయానికి ఖుషీ షూటింగ్లోకి ఎంటర్ అయితే ఆ సినిమా చేయాలని భావిస్తున్నారు. కానీ సమంతా నుంచి సరైన స్పందన రాకపోయినా, ఆమె అనారోగ్యం కారణాలవల్ల ఆలస్యం చేసినా కూడా శివ నిర్వాణ ఖుషీ సినిమాని పక్కన పెట్టి మెగా కాంపౌండ్ హీరోతో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం.
మెగా కాంపౌండ్ లోని ఓ హీరో డేట్స్ కూడా అతనికి అందుబాటులో ఉన్నాయి. దాంతో ఖుషీ చిత్రంలో సమంత రీ జాయిన్ అవుతుందా లేదా అన్నదాన్ని బట్టి శివనిర్వణ నిర్ణయం ఉండబోతోంది. మొత్తానికి మార్చి మొదటి వారంలో శివానిర్వాన ఖుషి షూటింగులో సమంతా పాల్గొనాల్సిందిగా కోరాడట. అప్పటికి కూడా ఆమె షూటింగులో జాయిన్ కాకపోతే మెగా కాంపౌండ్ హీరోతో ముందుకు సాగడం ఖాయమై తెలుస్తోంది. అయినా సమంత అనారోగ్యం నుంచి కోలుకుని శాకుంతలం చిత్రం పూర్తి చేసింది. రాజ్ డికెల దర్శకత్వంలో రూపొందుతున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. దీని షూటింగ్ నిమిత్తమే ఆమె ప్రస్తుతం ముంబైలో ఉంది.
మరి వాటికి లేని అనారోగ్య కారణాలు కేవలం ఖుషీకి మాత్రమే ఎలా వస్తాయి? అసలు సమంత మనసులో ఏముంది? ఆమె ఖుషీ చిత్రంలో నటించాలని భావిస్తోందా? లేదా? ఇలా పలు అనుమానాలకు ఆమె ప్రవర్తన తావిస్తోంది. మరో వైపు ఖుషీపై విజయ్ దేవరకొండ కూడా విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆయన జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. త్వరలో ఆ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని సమాచారం. ఏది ఏమైనా ఖుషీ చిత్రానికి ఏదీ కలిసి రావడం లేదు. ఈ చిత్రంపై అందరు ఆశలు వదిలేసుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.