నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు(ఫిబ్రవరి 3న) ట్రైలర్ విడుదల కానుంది. అలాగే ఫిబ్రవరి 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది.
'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో 'అమిగోస్'పై మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ పోషించడం, టీజర్ వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మైత్రి మేకర్స్. అందులో భాగంగా ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వేడుకకు బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ ఆల్ టైం హిట్స్ లో ఒకటైన 'ఎన్నో రాత్రులు వస్తాయి గాని' సాంగ్ ని రీమిక్స్ చేయడం విశేషం. మరోవైపు తారక్ కూడా కొంతకాలంగా సోదరుడు కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలకు రెగ్యులర్ గా వస్తున్నాడు.
బాబాయ్-అబ్బాయిలు ముగ్గురూ కలిసి చివరిసారిగా '118' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. మళ్ళీ ఇప్పుడు 'అమిగోస్' ఈవెంట్ కోసం వేదిక పంచుకోబోతున్నారని అంటున్నారు. నందమూరి హీరోలతో మైత్రి మేకర్స్ కి మంచి అనుబంధముంది. బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' మైత్రి బ్యానర్ లోనే రూపొందింది. అలాగే ఎన్టీఆర్ తో గతంలో 'జనతా గ్యారేజ్'ను రూపొందించిన మైత్రి.. ఆయన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మించనుంది.