క్లాసిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్(92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా. రేపల్లె సమీపంలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఆత్మ గౌరవం'(1966) సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమానే రెండు నంది అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత 'శంకరాభరణం', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం', 'సప్తపది' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించి తెలుగు సినిమాకు గౌరవాన్ని తెచ్చిన దర్శకుడిగా పేరు పొందారు.
తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప సినిమాలలో 'శంకరాభరణం'(1980) ముందు వరుసలో ఉంటుంది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది, అఖండ విజయం సాధించడమే కాకుండా.. జాతీయ పురస్కారం సైతం గెలుచుకుంది. 'సప్తపది' సినిమా నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం అవార్డు అందుకుంది. 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం', 'శృతిలయలు', 'స్వరాభిషేకం' చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. దర్శకుడిగా 50 కి పైగా సినిమాలు చేసిన విశ్వనాథ్ నటుడిగానూ రాణించారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్ వంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. సినిమారంగంలో చేసిన కృషికిగాను 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారం, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారం, 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 92 ఏళ్ల కె. విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 'శంకరాభరణం' విడుదలైన రోజే ఫిబ్రవరి 2న తుదిశ్వాస విడిచారు.