విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గీత గోవిందం'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం 2018 ఆగష్టులో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కి సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
'గీత గోవిందం' తరువాత పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా మాత్రమే వచ్చింది. ఆయన తదుపరి సినిమాపై ఇంతవరకు స్పష్టత లేదు. నాగ చైతన్యతో చేయాల్సిన ప్రాజెక్ట్ అటకెక్కిందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.. కానీ, ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇదిలా ఉంటే అసలు ఇవేవీ కాకుండా తెర వెనుక 'గీత గోవిందం' సీక్వెల్ కోసం చర్చలు జరుగున్నట్లు టాక్. త్వరలోనే 'గీత గోవిందం-2' కోసం విజయ్-పరశురామ్-జీఏ2 పిక్చర్స్ చేతులు కలపబోతున్నారని సమాచారం.
విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత విజయ్ చేయబోయే సినిమా 'గీత గోవిందం-2' అని అంటున్నారు. అదే జరిగితే 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తరువాత మరోసారి విజయ్-రష్మిక జోడీ వెండితెరపై సందడి చేయనుంది.