![]() |
![]() |

ఈ పొంగల్ కి కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన 'వారిసు', తల అజిత్ నటించిన 'తునివు' చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో విజయ్ కంటే అజిత్ కోలీవుడ్‌లో పై చేయి సాధించారు. కానీ తెలుగు విషయానికి వస్తే అజిత్ 'తెగింపు' కంటే విజయ్ నటించిన 'వారసుడు' సినిమానే ఓ మోస్తరు కలెక్షన్లను నమోదు చేస్తోంది. తమిళంలో మాత్రమే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున జనవరి 11న విడుదలయ్యాయి. తెలుగులో మాత్రం 'వారసుడు' మూడు రోజుల తర్వాత 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరి చూపు విజయ్ నటించబోయే 'విజయ్ 67' వర్కింగ్ టైటిల్ సినిమాపై నిలిచి ఉంది.
ఈ చిత్రానికి లోకేష్ కనకరాజు దర్శకత్వం చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దళపతి విజయ్ తన 67వ సినిమాను గౌతమ్ వాసుదేవ మీనన్ తో చేయబోతున్నాడు అని సమాచారం. వాసుదేవ మీనన్ తీసిన 'ఏ మాయ చేసావే', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', సూర్య-జ్యోతికలతో తమిళంలో తీసిన 'కాకా కాకా' వంటి సినిమాలు మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇక ఈయన ఇటీవల 'సీతారామం' చిత్రంలో ఓ పాత్రను కూడా చేశారు.
ఇక విజయ్, గౌతమీనన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో విజయ్ కి జోడిగా త్రిష నటించనుందట. చాలా ఏళ్ల తర్వాత ఈ జోడి మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ చిత్రం విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. విజయ్.. లోకేష్ కనకరాజును వదిలిపెట్టి గౌతమ్ వాసుదేవన్ తో తన 67వ చిత్రం చేయబోవడం నిజమేనా, కాదా అనేది తేలాల్సి ఉంది.
![]() |
![]() |