![]() |
![]() |

'మిరపకాయ్', 'గబ్బర్ సింగ్' వంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ మూడేళ్ళుగా కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. చివరిసారిగా ఆయన 2019లో విడుదలైన 'గద్దలకొండ గణేష్'తో అలరించాడు. అప్పటినుంచి ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రకటన వచ్చింది గానీ పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉంది. ఈ క్రమంలో హరీష్ తాను త్వరలో నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి బ్యానర్ లో రూపొందిన చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ జరగగా.. హరీష్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బాలయ్య బాబు కోసం కథ సిద్ధం చేసి, ఆయనతో సినిమా చేస్తానని అన్నాడు. ఇది తన కోరిక మాత్రమే కాదని, తమ నిర్మాతలు మైత్రి మూవీస్ కోరిక కూడా అని హరీష్ తెలిపాడు. మరి మైత్రి త్వరలోనే బాలయ్య-హరీష్ కాంబోలో సినిమాని సెట్ చేస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది.
![]() |
![]() |