![]() |
![]() |

టాలీవుడ్ లో ఒకనాడు గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ వంటి పలు భారీ నిర్మాణ సంస్థలు ఉండేవి. ప్రస్తుతం వాటి హవా తగ్గింది. వాటి స్థానంలో మైత్రి మూవీ మేకర్స్, యు వి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ వంటి సినిమా నిర్మాణ సంస్థలు వరుస చిత్రాలను నిర్మిస్తున్నాయి. ఇక మైత్రి మూవీస్ మేకర్స్ విషయానికి వస్తే వారు నిర్మించిన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరు నటించిన వాల్తేరు వీరయ్యలు రెండు ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ దిశగా సాగిపోతున్నాయి. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుండి ఒకే పండుగకు ఇద్దరు పోటా పోటీగా ఉన్న స్టార్స్ నటించిన చిత్రాలను ఒకేసారి నిర్మించిన ఘనత మైత్రి వారికి దక్కుతుంది అని చెప్పాలి. వీరు ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్, విజయ్ దేవరకొండ, సమంతలతో శివానిర్వాన దర్శకత్వంలో ఖుషి, అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్‌ల కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఎన్టీఆర్ 31, రామ్ చరణ్ -బుచ్చిబాబుల కాంబోలో ఆర్ సి 16 వంటి పలు చిత్రాలను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ఓ చిత్రాన్ని కన్ఫర్మ్ చేశారు.
గత కొంతకాలంగా మీడియాలో ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా పఠాన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇక ప్రభాస్ విషయానికొస్తే ఆయన ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ వంటి నాలుగు చిత్రాలను చేస్తున్నాడు. ఇందులో మూడు చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతుండగా, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ మూవీ రాజా డీలక్స్ ప్రస్తుతానికి తెలుగులో రూపొందుతోంది. సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ప్రాజెక్ట్ కె మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని తెలుస్తోంది. ఆది పురుష్ చిత్రం ఇదే ఏడాది జూన్లో రాబోతోంది.
![]() |
![]() |