![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ఇంకా 'సలార్' విడుదలే కాదు.. అప్పుడే ప్రభాస్, ప్రశాంత్ నీల్ 'రావణం' అనే మరో భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, శంకర్ కలయికలో 'RC15' అనే భారీ బడ్జెట్ ఫిల్మ్ ని నిర్మిస్తున్న దిల్ రాజు.. ఇక మీదట వరుసగా అలాంటి భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'రావణం', మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'జటాయు', శైలేష్ కొలను దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాలు చేయబోతున్నట్లు చెప్పాడు. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నట్లు తెలిపాడు. నటీనటులు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు.
ప్రభాస్-ప్రశాంత్ నీల్-దిల్ రాజు కలయికలో సినిమా రానుందని గతంలో వార్తలొచ్చాయి. ఈ లెక్కన ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రకటించిన 'రావణం'లో ప్రభాస్ నటించనున్నాడని అంటున్నారు. అదే నిజమైతే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. ఇది రావణబ్రహ్మ కథతో రూపొందనున్న చిత్రమని తెలుస్తోంది. ఇప్పటికే 'ఆదిపురుష్'లో రాముడిగా కనువిందు చేయడానికి సిద్ధమవుతున్న ప్రభాస్.. రావణబ్రహ్మగా ఎలా ఉంటాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
![]() |
![]() |