తెలుగునాట ఎన్నో ప్రేమకథా చిత్రాలు అలరించాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే క్లాసిక్ స్టేటస్ ని పొందాయి. అలాంటి చిత్రాల్లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన `గీతాంజలి` ఒకటి. ప్రణయ దృశ్యకావ్యంలా తెరకెక్కిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో `కింగ్` నాగార్జున కథానాయకుడిగా నటించగా.. అతనికి జోడీగా టైటిల్ రోల్ లో గిరిజ దర్శనమిచ్చారు. మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. ``ఓ ప్రియా ప్రియా``, ``ఓ పాపా లాలీ``, ``ఆమని పాడవే``, ``నందికొండ వాగుల్లోన``, ``ఓం నమః``, ``జల్లంత కవ్విత``, ``జగడ జగడ``.. ఇలా ఇందులోని ఏడు గీతాలూ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
`ఉత్తమ చిత్రం`, `ఉత్తమ కథా రచయిత`, `ఉత్తమ హాస్యనటుడు`, `ఉత్తమ నృత్యదర్శకత్వం`, `ఉత్తమ ఛాయాగ్రహణం`, `ఉత్తమ కళాదర్శకుడు` విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ దర్శకుడు` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డును అందుకున్న `గీతాంజలి`.. `బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మైంట్` కేటగిరిలో `జాతీయ పురస్కారం` సైతం సొంతం చేసుకుంది. `ఇదయత్తై తిరుడాదే` పేరుతో తమిళంలో అనువాదమైన `గీతాంజలి` అక్కడ కూడా విశేషాదరణ పొందింది. అలాగే, హిందీలో `యాద్ రఖేగీ దునియా` (ఆదిత్య పంచోలీ, రుక్సార్ రెహ్మాన్) పేరుతో రీమేక్ అయింది. 1989 మే 12న విడుదలై ఘనవిజయం సాధించిన `గీతాంజలి`.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంది.