ప్రముఖ తమిళ సినీ నిర్మాత సేలమ్ చంద్రశేఖర్ కన్నుమూశారు. ఆయన కొవిడ్ 19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. సూర్య హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ రూపొందించిన 'గజిని' చిత్ర నిర్మాతగా ఆయన పాపులర్ అయ్యారు. ధనుష్‌తో 'సుల్లాన్', విజయ్‌కాంత్‌తో 'శబరి', భరత్‌తో 'ఫిబ్రవరి 14' లాంటి సినిమాలను చంద్రశేఖర్ నిర్మించారు.
సినీ నిర్మాతగా మారక ముందు ఆయన పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయనకు సొంత థియేటర్ ఉంది. చెన్నైలోని మూడు స్క్రీన్ల ఏఆర్‌కే కాంప్లెక్స్ ఆయనదే. చివరిసారిగా ఆయన భరత్, మీరా చోప్రా జంటగా 'కిల్లాడి' సినిమాని నిర్మించారు. 2006లో షూటింగ్ ప్రారంభమైన ఆ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చి, 9 సంవత్సరాల తర్వాత 2015లో థియేటర్లలో విడుదలైంది.
'గజిని' చిత్రానికి మ్యూజిక్ అందించిన హారిస్ జయరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చంద్రశేఖర్‌కు నివాళులు అర్పిస్తూ, "R I P Mr Chandrasekar (Producer of Gazini). Thank you for the movie which can't be forgotten." అని రాసుకొచ్చారు.