![]() |
![]() |

బిగ్ బాస్ 4 తెలుగు షో విన్నర్‌గా అభిజీత్ నిలిచాడు. అయితే విన్నర్‌కు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు కాగా, అభిజీత్‌కు ఆ మొత్తం అందలేదు. అందులో సగం అమౌంట్‌ను సింగరేణి కుర్రోడు సయ్యద్ సొహేల్ ఎగరేసుకుపోయాడు. బరిలోంచి హారిక, అరియానా ఎలిమినేట్ అయ్యాక టాప్ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు నాగార్జున ఇచ్చిన ఆఫర్ విన్నర్ ప్రైజ్ మనీని సగానికి తగ్గించేసింది. ఇది న్యాయం కాదు.. అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విన్నర్ ప్రైజ్ మనీని ఆకస్మికంగా ఎలా తగ్గిస్తారంటూ, ఇది సరైన పని కాదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఆ విషయం అలా ఉంచితే, నాగ్ ఇచ్చిన ఆఫర్‌ను సొహేల్ సరిగ్గానే వినియోగించుకున్నాడు. విన్నర్‌గా అభిజీత్ దాదాపు ఖాయం అని రెండు వారాలుగా వ్యూయర్స్ ఫిక్స్ అయివున్న వేళ.. రూ. 25 లక్షలు ఉంచిన గోల్డ్ బాక్స్‌ను హౌస్‌లోకి పంపి, ఆ ఆఫర్‌ను ఎవరైనా తీసుకుంటారా?.. అని నాగ్ అడిగినప్పుడు అనూహ్యంగా సొహేల్ ముందుకు వచ్చాడు. ముందుగానే తాను విన్నర్ అయ్యే అవకాశం లేదని అతను గ్రహించినట్లే కనిపించాడు. అంతకు ముందు టాప్ 4 కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే ప్రక్రియ చూశాక, అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది.
ఆ ప్రక్రియలో ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి.. రెడ్ లైట్ వస్తే హౌస్‌లో ఉంటారనీ, గ్రీన్ వస్తే ఎలిమినేట్ అయినట్లనీ నాగ్ ప్రకటించారు. బటన్ నొక్కే బాధ్యతను నటి లక్ష్మీ రాయ్‌కు అప్పగించాడు. మొదట అభిజీత్‌కు, తర్వాత అఖిల్‌కు రెడ్ సిగ్నల్ వచ్చి, సేఫ్ అయ్యారు. మూడో వ్యక్తిగా అరియానాను పిలిచినప్పుడు ఆమెకు కూడా రెడ్ వస్తుందనీ, మిగిలేది సొహేల్ కాబట్టి, అతనికి గ్రీన్ వచ్చి ఎలిమినేట్ అవుతాడనీ చాలా మంది సందేహించారు. సొహేల్ కూడా అలాగే భావించినట్లు కనిపించాడు. అయితే అరియానాకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సొహేల్ బతికిపోయాడు. అతడికి సిగ్నల్ టెస్ట్ చేయలేదు. అప్పుడే చాలా భావోద్వేగానికి గురయ్యాడు సొహేల్. తాను హౌస్‌లో టాప్ 3గా నిలవడం నమ్మలేనట్లు ప్రవర్తించాడు.
అందుకు రూ. 25 లక్షల ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నాడు సొహేల్. తాను ఎందుకు ఆ ఆఫర్ ఎంచుకున్నాడో కూడా అతను తెలిపాడు. వాటిలో రూ. 5 లక్షలు అనాథాశ్రమానికీ, రూ. 5 లక్షలు తోటి కంటెస్టెంట్, ఫ్రెండ్ మెహబూబ్‌కు ఇస్తాననీ, అతను ఇల్లు కట్టుకుంటున్నాడనీ, మిగతా రూ. 15 లక్షలు తాను ఉంచుకుంటాననీ చెప్పాడు సొహేల్. విన్నర్ ప్రైజ్ మనీలోంచే ఈ రూ. 25 లక్షల ఆఫర్ అనీ, మిగతా ఇద్దరు కంటెస్టెంట్లకు అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించాడు నాగ్. ఆయనే అలా అంటే, విన్నర్‌గా పోటీలో నిలిచినవాళ్లు మాత్రం ఎందుకు కాదంటారు? అఖిల్, అభిజీత్ కూడా దీనికి సరేనన్నారు.
అలా రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చాడు సొహేల్. అయితే ఆ మొత్తం అమౌంట్‌ను సొహేల్‌నే ఉంచుకోమనీ, అనాథాశ్రమానికీ, మెహబూబ్‌కూ ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తాను ఇస్తాననీ నాగ్ ప్రకటించారు. దాంతో సొహేల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సో.. విన్నర్ అయిన అభిజీత్‌కూ రూ. 25 లక్షలు మాత్రమే అందాయన్న మాట.
![]() |
![]() |