![]() |
![]() |

వంద రోజులుగా వీక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు రేపటితో తెరపడనుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలని జనం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహేల్ మధ్య నెలకొన్న భీకరమైన పోటీ ఫైనల్‌ను రసవత్తరంగా మార్చేసింది. కాగా టాప్ 5 ఫైనలిస్ట్‌లతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కలుసుకొనే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించడంతో శుక్రవారం ప్రేక్షకులకు మంచి మజా లభించింది. అఖిల్, మోనాల్ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ పెనవేసుకుందో వ్యూయర్స్‌కు తెలిసింది.
హౌస్ బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారని తెలియగానే హౌస్‌మేట్స్ ఉత్సాహంతో వారి దగ్గరకు ఉరుకులు పరుకులతో వచ్చారు. మోనాల్ వచ్చినట్లు ప్రకటించగానే అఖిల్, సొహేల్ ఎట్లా పరుగులు పెట్టారో! గ్లాస్ రూమ్ లేకపోతే అఖిల్, మోనాల్ ఏం చేసేవారో అనిపించింది. హౌస్‌లో నుంచి వచ్చిన అఖిల్ గ్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి చేతులు బార్లా చాపి, గ్లాస్‌ను కావలించుకోగా, మోనాల్ లోపలి నుంచి అతడి అభిముఖంగా అలాగే చేసింది. గ్లాస్ లేకపోతే, ఒకరినొకరు బిగియార కౌగలించుకొనేవారనేది స్పష్టం. ఆ ఇద్దరూ అలా నిమిషం పైగా ఉండటతో సొహేల్ ప్రేక్షక పాత్ర వహించాడు.
అఖిల్‌తో నిన్ను చాలా మిస్సవుతున్నాననీ, రాత్రిపూట నిద్రపట్టడం లేదనీ మోనాల్ చెప్పగా, తనకు కూడా అలాగే ఉందని అఖిల్ మంచి మసాలా వేశాడు. అభిజీత్ వచ్చి సూపర్‌గా ఉన్నావన్నట్లు సైగ చేశాడు. అతడి భవిష్యత్తు బాగుండాలని చెప్పింది మోనాల్. సొహేల్‌ను విన్నర్ కావాలని చెప్పిన ఆమె, అంతకు ముందు అఖిల్‌తో నువ్వే నంబర్ వన్ అని చెప్పడం గమనార్హం. అరియానాను చూస్తుంటే ఈర్ష్య కలుగుతోందని అంటూనే, ఆమెతో స్నేహం పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది మోనాల్.
మోనాల్‌తో పాటు కరాటే కల్యాణి, లాస్య, స్వాతి దీక్షిత్, కుమార్‌సాయి కూడా హౌస్‌లోకి వచ్చి వినోదాన్ని పంచారు.
![]() |
![]() |