టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా అభిమానుల చేత నీరాజనాలు అందుకుంటున్న మహేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి జూలై 30తో 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'రాజకుమారుడు' మూవీతో మహేశ్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా 1999 జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ, త్వరలో 50 వసంతాలు పూర్తిచేసుకోబోతున్న వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అంటే అప్పటి టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ కలిసి మహేశ్‌ను హీరోగా ప్రెజెంట్ చేశారన్న మాట.
సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడిగా మహేశ్ సునాయాసంగానే హీరోగా తొలి అవకాశాన్ని పొందాడు. నిజానికి అదివరకే బాలనటుడిగా చిచ్చరపిడుగు అనే పేరు సంపాదించుకున్న మహేశ్‌ను హీరోగా కృష్ణ స్వయంగా పరిచయం చేయవచ్చు. కానీ అతడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యడానికి అప్పటి టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్లు తహతహలాడారంటే.. అప్పటికే మహేశ్ సంపాదించుకున్న క్రేజ్‌కు నిదర్శనం. 'రాజకుమారుడు'గా టైటిల్ రోల్‌లో చాక్లెట్ బాయ్‌గా మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ప్రేక్షకులు బాగా ముచ్చటపడ్డారు. ప్రీతి జింటాతో అతడి ఆటపాటలు వాళ్లకు నచ్చాయి. కమర్షియల్‌గా విజయం సాధించిన ఆ సినిమాతో ఉత్తమ తొలిచిత్ర నటుడిగా నంది అవార్డును కైవసం చేసుకున్నాడు మహేశ్.
'రాజకుమారుడు' హిట్టయినా ఆ తర్వాత రెండు సినిమాలు 'యువరాజు', 'వంశీ' సరిగా ఆడకపోవడంతో మహేశ్ కెరీర్ ఎలా ఉంటుందోననే అనుమానాలు తలెత్తాయి. కృష్ణవంశీ 'మురారి'తో నిలదొక్కుకొని, గుణశేఖర్ 'ఒక్కడు'తో స్టార్‌గా రూపుదాల్చాడు మహేశ్. ఆ తర్వాత అతను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. తండ్రికి తగ్గ తనయునిగా.. ఇంకా చెప్పాలంటే క్రేజ్ పరంగా తండ్రిని మించిన తనయునిగా రాణించి, సూపర్‌స్టార్ అనే ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదుకు న్యాయం చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్‌గా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు సాధించి.. నేటితో హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు మహేశ్.