దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు, దివంగత నటి రాధాకుమారి దంపతులు. ఈ సంగతి ప్రేక్షక లోకానికి తెలిసిందే. అయితే, వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికరమైన ముచ్చట ఉంది. అది తెలుసా? అయితే, ఈ చిన్నికథ చదవండి.
రాధాకుమారిది విజయనగరం. అమె నాటకాల్లో నటించేవారు. రావి కొండలరావుది శ్రీకాకుళం. వాళ్ళు విజయనగరానికి నాటకపోటీలకు వెళుతూ ఉండేవాళ్ళు. రావి కొండలరావుకి అన్నయ్య ద్వారా రాధాకుమారి పరిచయమయ్యారు. తరవాత ఆమె నాన్న పరిచయమయ్యారు. ఆయన ఒకసారి ‘మా అమ్మాయికి సినిమాల్లో వేషాలు ఉంటే చూడండి’ అని కొండలరావుతో చెప్పారు. తొలుత డబ్బింగ్ చెప్పడానికి కబురు పంపారు. అప్పట్లో డబ్బింగ్ సినిమాలు బాగుండేవి. ఆమెకు అవకాశాలు ఇప్పించడానికి ఆయన తోడుగా వెళుతూ ఉండేవారు. దాంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇద్దరిదీ రంగస్థల నేపథ్యం కావడంతో ఒకసారి ‘ఈమెను పెళ్లి చేసుకుంటే... నాటకాల్లో నటి కొరత తీరుస్తుంది’ అని రావి కొండలరావుకి అనిపించింది. అదే మాట ఆయన తల్లితో చెప్పారు. ‘ఇద్దరూ నాటకాలు వేస్తే... మరి, వంట ఎవరు చేస్తారు?’ రావి కొండలరావును తల్లి ప్రశ్నించింది. ‘మా తిప్పలు ఏవో మేం పడతాం’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ‘మీ ఇష్టం’ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అదీ కథ!