రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివానీ ముఖ్యమంత్రి కుమారుడితో కలసి నటించబోతోంది. నిజానికి శివానీ నటిగా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల తను కమిట్ అయిన రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించిన ఉదయనిధి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగాను గెలిచాడు.
బాలీవుడ్ లో హిట్ అయిన 'ఆర్టికల్ 15' సినిమాను ఉదయనిధి హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా ఖరారైంది. మరో హీరోయిన్గా శివానీని ఎంపిక చేసుకున్నారు. ఒరిజినల్ లో సయాని గుప్తా పోషించిన పాత్రను తమిళంలో శివానీ పోషించనుంది. అరుణ రాజా కామరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. బోనీ కపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.