![]() |
![]() |

సాధారణంగా ఒక డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వచ్చే చిత్రంపై అంచనాలు తక్కువగా ఉంటాయి. ఆ చిత్రం ఎంత బాగా ఉన్నా కూడా విడుదల కాకముందు ఆ చిత్రంపై ఓ రకమైన అనుమానం ఉంటుంది. దాని వల్ల అనుకున్న స్థాయిలో బజ్ ఉండదు. అనుకున్న విధంగా బిజినెస్ జరగదు. అదే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత చేయబోయే చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి.
అలా వారికి బిజినెస్ పరంగా ఓ బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మించే దర్శక నిర్మాతలు బాగా లాభపడతారు. ఇదే విషయం తాజాగా వాల్తేరు వీరయ్య నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవికి అనుకోకుండా ఆచార్య డిజాస్టర్ వచ్చింది. గాడ్ ఫాదర్ చిత్రంతో ఓకే అనిపించుకున్నారు. కానీ ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా చిరు అభిమానులు కోరుకునే ఎలివేషన్స్, ఎంటర్టైన్మెంట్, మాస్ యాంగిల్ ఇలా అన్ని సమపాళ్లలో కుదరడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయ బావుటాను ఎగురవేస్తోంది.
వాల్తేరు వీరయ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రఫ్ఫాడిస్తోంది. ఈ జోష్ చిరంజీవితోపాటు మెగా అభిమానులకు అందరికీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వచ్చింది. ఈ జోష్ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ తో చిత్రం చేయబోతున్న దర్శక నిర్మాతలకు మరింత ఊపునిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు తమిళంలో హిట్ అయిన వేదాళం రీమేక్ లో నటించనున్నారు. ఈ చిత్రం టైటిల్ బోళా శంకర్. దర్శకుడిగా ఇప్పటివరకు విజయం అనేది ఎరుగని డిజాస్టర్ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అనిల్ సుంకర ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.
వాల్తేరు వీరయ్య జోష్‌తో తమ చిత్రానికి భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని వీరు ఆనందపడుతున్నారు. ఈ సంబరంలోనే వారు మునిగి తేలుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. జనవరి 17న ఈ షెడ్యూల్ ప్రారంభం కాగా కోల్ కత్తా కాళీ సెట్టులో ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య బోళాశంకర్‌కు ఊపునిచ్చి ఈ దర్శక నిర్మాతలు జాక్ పాట్ కొట్టేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |