నటుడు బండ్ల గణేష్ 'ఆంజనేయులు', 'గబ్బర్ సింగ్', 'బాద్ షా', 'టెంపర్' వంటి సినిమాలతో తక్కువ సమయంలోనే బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఏవో కారణాల వల్ల ఎనిమిదేళ్లుగా ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళీ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. 'క్రాక్' కాంబినేషన్ లో ఆయన సినిమా చేయనున్నారని తెలుస్తోంది.
ఇటీవల బాలకృష్ణతో చేసిన 'వీరసింహారెడ్డి'తో హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమాని రవితేజతో చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ-గోపీచంద్ కలయికలో 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' సినిమాలు రాగా మూడూ విజయం సాధించాయి. ముఖ్యంగా 'క్రాక్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వారి కాంబోలో నాలుగో సినిమా రానుందని, దానిని బండ్ల గణేష్ నిర్మించనున్నాడని టాక్. రవితేజ హీరోగా నటించిన 'ఆంజనేయులు' చిత్రంతోనే బండ్ల గణేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బండ్ల గణేష్ రీఎంట్రీ కూడా రవితేజ సినిమాతోనే ఇవ్వనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.