'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సాగర్ కె.చంద్ర తన మూడో చిత్రం 'భీమ్లా నాయక్'ను ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు సాగర్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే తాజాగా ఆయన నాలుగో చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్.. 'జయ జానకి నాయక', 'రాక్షసుడు' వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ 'ఛత్రపతి' రీమేక్ తో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుండగా.. తెలుగులో మాత్రం ఆయన చేయనున్న సినిమాలపై స్పష్టత లేదు. టైగర్ నాగేశ్వరారావు జీవిత కథ ఆధారంగా 'స్టువర్టుపురం దొంగ' అనే సినిమాని ప్రకటించాడు కానీ ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ అదే కథతో 'టైగర్ నాగేశ్వరారావు' అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దీంతో 'స్టువర్టుపురం దొంగ' అటకెక్కినట్లే అంటున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు బెల్లంకొండ తన తదుపరి చిత్రాన్ని సాగర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్ర ప్రకటన మార్చిలో రానుందని టాక్.