![]() |
![]() |
తొలి సినిమాతోనే సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’ వంటి డిఫరెంట్ మూవీతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు.. రామ్‌చరణ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం తన రెండో సినిమాతోనే దక్కించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ ఒక స్పెషల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, రామ్‌చరణ్ లుక్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ తొలిసారి రామ్‌చరణ్ చిత్రానికి సంగీతం అందించడం ఒక విశేషం. కాగా, తన రెండో సినిమాకే రెహమాన్‌తో కలిసి పనిచేసే అవకాశం బుచ్చిబాబుకి రావడం మరో విశేషం. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. చరణ్ కెరీర్‌లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని మెగా అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు చేయబోయే సినిమా గురించి ఇండస్ట్రీలో వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో తెలుగు సినిమాలకే పరిమితమైన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. ఇప్పుడు ఇతర భాషల్లో కూడా వరసగా చిత్రాలు నిర్మిస్తోంది. ఇప్పటికే తమిళ్‌లో గుడ్ బ్యాడ్ అగ్లి, హిందీలో జాట్ వంటి భారీ చిత్రాలను నిర్మించారు మైత్రి అధినేతలు. అందులో భాగంగానే మరో భారీ సినిమాకి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకుడుగా ఎంపికయ్యారన్న వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మైత్రి అధినేతలు షారూక్‌తో చర్చలు జరిపి అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మూడో సినిమానే షారూక్ వంటి స్టార్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’ పూర్తయిన తర్వాత షారూక్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందే సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
![]() |
![]() |