ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడికి మరో అవకాశం రావడం కష్టమవుతుంది. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం తమ బ్యానర్ కి భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ముచ్చటగా మూడోసారి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.
గోపీచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన 'జిల్'(2015) చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. అయినప్పటికీ రాధాకృష్ణకు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'రాధేశ్యామ్' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించే అవకాశమిచ్చింది యూవీ. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. 'రాధేశ్యామ్' రూపంలో డిజాస్టర్ ఇచ్చినప్పటికీ రాధాకృష్ణపై యూవీకి నమ్మకం పోలేదని తెలుస్తోంది. దర్శకుడిగా ఆయనకు మూడో అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. రాధాకృష్ణ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి యూవీ క్రియేషన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి.