నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ మొదటి సినిమాకి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. తేజస్విని సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో కాసేపు బాలయ్య సందడి చేస్తారని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
మోక్షజ్ఞ మొదటి సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధృవ్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ధృవ్ కి ప్రశాంత్ వర్మ కథ చెప్పగా, ఈ సినిమాలో భాగం కావడానికి ధృవ్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా రూపొందిన 'ఆదిత్య వర్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్.. ఆ తర్వాత తన తండ్రి విక్రమ్ తో కలిసి 'మహాన్'లో నటించాడు. ప్రస్తుతం 'బైసన్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.