ఎందరెందరో...
దేశభక్తులు...త్యాగధనులు....
స్వాతంత్ర సమరయోధులు...
గాంధీజీ పిలుపునందుకొని....
త్రివర్ణ పతాకాన్ని చేబూని.....
జై భారత్ అంటూ జైళ్ళలో మ్రగ్గారే...
వందేమాతరమంటూ నేలకొరిగారే...
ఉప్పెనలై ఉద్యమాలకు ఊపిరి పోశారే...
ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారే....
బ్రిటిష్ సైన్యంతో భీకర పోరాటం చేశారే...
అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని అందించారే...
తెల్లదొరలను తరిమేశారే...ఆపై ఏమైంది ?
నల్లదొరలు గద్దెనెక్కారే...ఎటు చూసినా
మతం ముసుగులో మారణహోమాలే...
కులం కుంపట్లే కులంపేర కుమ్ములాటలే...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని...
అంబేద్కర్ స్వేదం చిందించి అందించిన
భారత రాజ్యాంగం ఒక రక్షణ కవచమని...
నాడు ప్రశంసల జల్లులు కురిపించారే...
నేడు బడుగు బలహీవర్గాలకు
అమరజీవి అంబేద్కర్ అందించిన
రిజర్వేషన్లనే రాజ్యాంగ రక్షణకవచాలను
సవరణల పేరుతో సమాధి చేస్తున్నారే...
ఇదేమి న్యాయం ?ఇదేమి ధర్మం ?
ఇదేమి ప్రభుత్వం?ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
బడా బాబులు స్విస్ బ్యాంకులో
దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని
రప్పించి ప్రజలకు పంచేస్తామన్నారే...
ఆ వాగ్దానాలను నల్లదొరలు మరిచారే...
రాజ్యాంగాన్ని తమకనుకూలంగా
మార్చుకుంటూ ప్రజాస్వామ్యం పేరుతో
నియంతృత్వ పాలన సాగిస్తున్నారే...
లాభాల బాటలో నడిచే ఎన్నో భారీ
ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ గద్దలు
తన్నుకు పోతూవుంటే ప్రభుత్వాధినేతలు
కళ్ళకు గంతలు కట్టుకున్నారే...
పన్నులరూపేన ప్రజలనడ్డి విరుస్తున్నారే...
ఇదేమి న్యాయం ? ఇదేమి ధర్మం ?
ఇదేమి ప్రభుత్వం?ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
అబ్రహం లింకనే
ఆశ్చర్యపోయేలా...
కార్పొరేట్ సంస్థల చేత
కార్పొరేట్ సంస్థల కొరకే
కార్పొరేట్ సంస్థలే కోరిన
ప్రభుత్వ పరిపాలన అంటూ
ప్రజాస్వామ్యం అర్థాన్నే మార్చేశారే...
ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారే...
ప్రతిఘటించే కలాలకు సంకెళ్లేస్తున్నారే...
ఇదేమి ధర్మం ? ఇదేమి న్యాయం ?
ఇదేమి ప్రభుత్వం? ఇదేమి ప్రజాస్వామ్యం?
విజ్ఞులారా ! వినండి !
మేధావులారా ! మేల్కొనండి !
యువకుల్లారా ! ఆలోచించండి !
ప్రజాస్వామ్యవాదులారా ! ప్రశ్నించండి !



