రాజకీయం...ఒక ఊబి...
రాజకీయం...ఒక ఇంద్రజాలం...
రాజకీయం...ఒక లక్కీ ఛాన్స్...
రాజకీయం...ఒక లక్కీ లాటరీ...
రాజకీయం...ఒక ఎండమావి...
రాజకీయం...ఒక రావణకాష్టం...
రాజకీయం...ఒక ఇంద్రధనుస్సు...
నేడు వాళ్ళు శత్రువులై...
చెప్పులూపుకుంటారు...
వీలైతే విసురుకుంటారు...
వేదికలెక్కి తిట్టుకుంటారు...
కార్యకర్తలు కొట్టుకుంటారు...
నేడు వాళ్ళు
ఒకరి మీద ఒకరు
నూరుకుంటారు కత్తులు...
వేస్తారు ఎత్తులకు పైఎత్తులు...
కొందరు తొత్తులు చపలచిత్తులు...
నిన్నటి బద్దశత్రువులే...
రేపటి ప్రాణమిత్రులై...
పెట్టుకుంటారు పొత్తులు...
ఇచ్చుకుంటారు పూలగుత్తులు...
కప్పుకుంటారు కాశ్మీర్ శాలువలు...
మద్దతిస్తారు...మాయగాళ్ళు...
అందిస్తారు...అభయహస్తాలు..
ఆపై పంచుకుంటారు...పదవుల్ని...
తీర్చుకుంటారు...అధికారదాహాన్ని...
అందుకే ఓ మిత్రమా !
నమ్మకు...నమ్మకు...
రాజకీయ రాబందులను...
కడుపులో కత్తులుంచుకొని ...
కౌగిలించుకునే కసాయిగుండాలను...



