నిన్న నేను నిన్ను లోపల తంతూవున్నా...
చిరునవ్వులు చిందిస్తూ...బయటికి రారా
కన్నా నీ లేతపాదాలను ముద్ధాడాలంటూ...
నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చి....
నీ ఎర్రనిరక్తాన్ని తెల్లనిపాలుగా మార్చి...
నా బుజ్జి కడుపు నింపి నీ చల్లనిచేతులతో
నీ బంగారు ఒడి ఊయలలో నన్ను ఊపి...
జోలాలి...జోజో లాలి...అంటూ
జోలపాటలు పాడి లాలించి...
నా కోతి అల్లరిని భరించి...
బుజ్జగించి...చందమామ రావే
జాబిల్లి రావే...అంటూ పాటలుపాడి
గోరుముద్దలు తినిపించి...
కమ్మని కథలెన్నో చెప్పి...
ప్రేమామృతాన్ని పంచి...
అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి...
కంటికిరెప్పలా నన్ను కాపాడి...
నా బంగారు భవిష్యత్తుకై
కమ్మని కలలు కన్న...
కన్నీటిని దిగమింగిన...
కడుపులు మార్చుకున్న ...
నా చదువుకై అప్పులెన్నోచేసి
తీర్చలేక నానా తిప్పలు పడిన...
అవమానాలు అష్టకష్టాలెన్నో
ఆనందంగా అనుభవించిన...
ఓ అమ్మా..! నీకు వందనం..!
అభివందనం..! పాదాభివందనం..!
నీవే నా ఆత్మ...
నీవే నా దైవం...
నీవే నా ప్రాణం...
నీవే నా తొలి గురువు...
నీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీరనిది
నా జీవితం పుష్పం...ప్రేమను కురిపించు
నీ పాదారవిందాలకు అర్పితం...
రేపు నిన్ను
ఆకలికి అలమటించే
"అస్థిపంజరంగా" మార్చను...
రేపు నిన్ను ఆనాధాశ్రమంలో
"అతిథిగా" చేర్చను...
కన్నుమూసేవరకు నిన్ను
కంటికిరెప్పలా కాపాడుకుంటాను...
నీ కొడుకునైన నేను...నేడు
పంచభూతాల సాక్షిగా...
ఆ పరమాత్మ సాక్షిగా ...
పరమపావనమైన నీ పాదాలను
ముద్దాడి చేస్తున్నా...ఈ ప్రమాణం...



