ఎక్కడున్నాయి ?
స్వర్గ లోకాలు...నరక కూపాలు...
ఎవరు చూశారు ?
స్వర్గ ద్వారాన్ని...నరక కూపాన్ని...
అన్నీ అవన్నీ ఈభూమి మీదనే కాదా ?
నిత్యం మనం అనుభవించడం లేదా ?
మన కళ్ళకు కనిపించవు కదా
ఏ కష్టనష్టాలు...ఏ సుఖదుఃఖాలు
సుఖమే స్వర్గమని...దుఃఖమే నరకమని...
ఈ మట్టిమనిషికి అర్థమయ్యేదెప్పుడో?
మన ఆనందమే మనకు స్వర్గమని...
మన వ్యధ ఆవేదనే మనకు నరకమని...
ఈ మట్టి మనుషికి జ్ఞానోదయమయ్యేదెప్పుడో?
మన చిరునవ్వే స్వర్గమని...
మన చింత చీకటే నరకమని...
ఈ మట్టిమనిషికి కనువిప్పు కలిగేదెప్పుడో?
ఏ మొండివ్యాధి సోకో
ఏ హాస్పిటల్లో బెడ్ మీదనో
ఏ ఐసీయూలోనో ప్రాణభయంతో
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై పోవడమే నరకమని...
ఇంట్లో పిల్లాపాపలతో
ఉల్లాసంగా...ఉత్సాహంగా
విందు...వినోదాల్లో మునిగి
సంతోష...సంబరాల్లో తేలుతూ
హాయిగా...ఆనందంగా...సరదాగా
ప్రశాంతంగా...జీవించడమే స్వర్గమని...
ఈ మట్టిమనిషికి అర్థమయ్యేదెప్పుడో?
కళ్ళకు గంతలు కట్టుకున్న
మాయా ముసుగును కప్పుకున్న
అజ్ఞానాంధకారంలో మునిగివున్న
ఈ మట్టిమనిషికి ఈ సత్యం అర్థమయ్యేదెప్పుడో ?
ఔనిదినిజం నవ్వితే...నరకమైనా స్వర్గమౌతుంది
ఔనిదిపచ్చినిజం ఏడిస్తే...స్వర్గమైనా నరకమైపోతుంది



