Facebook Twitter
ప్రశాంతతకై ప్రార్ధన ! ఈ కొత్త సంవత్సరంలో…

ఓ దయగల దైవమా !
మా మొర ఆలకించుమా !
నిన్న కోవిడ్ కొట్టిన
కొరడా దెబ్బలకు
గతమంతా గాయాలమయమే
అందుకే ఓదైవమా!
ఈ సంవత్సరంలోనైనా
కలలను కల్లలుచేయని
... నెలలను
మానసిక వ్యధలకు గురిచేయని
... మాసాలను
వాదాలు వికృత విభేదాలులేని
... వారాలను
గండాలు సుడిగుండాలులేని
... గంటలను
ఏ కష్టాలు ఏ కన్నీళ్లులేని 
ఏ రోగాలురాని
... రోజులను
నిప్పులా కాల్చే
నిరాశ
నిట్టూర్పులులేని
... నిమిషాలను
ప్రశాంతత తప్ప
ప్రమాదాలు దరిజేరని
... ప్రతి క్షణాన్ని
మచ్చలేని చందమామలాంటి
స్వచ్ఛమైన అమ్మ పాలలాంటి
మల్లెలా... ...తెల్లనైన
మంచులా... చల్లనైన
తెనెలా... ... తీయ్యనైన
చెట్టులా... .. పచ్చనైన
ఒక నూతన సంవత్సరాన్ని
మాకు ప్రసాదించమని
ఆశతో అర్థిస్తున్నాం,
పేరాశతో ప్రార్థిస్తున్నాం తండ్రీ!