Facebook Twitter
ఖర్చులు - కన్నీళ్ళు

నాలుగుఅంకెల జీతం రాగానే
నాలుగు రోజుల్లో వీకెండ్సంటూ
షాపింగ్సంటూ పార్టీలంటూ‌
పబ్బులంటూ క్లబ్బులంటూ
సినిమాలంటూ షికార్లకంటూ
కార్లల్లో విచ్చలవిడిగా తిరుగుతూ
కార్డుల్లోని కరెన్సీని జల్సాలకు ఖర్చుచేస్తూ
నేడు విలాసాలలో మునిగితేలే మూర్ఖులు
రేపు కులాసాగ బ్రతకలేరు

కుటుంబ బాధ్యతలు మోయలేక
క్రుంగిపోక తప్పదు
తెచ్చిన అప్పులు తీర్చలేక
కుమిలిపోక తప్పదు
బజారులో పరువుపోయి
బ్రతుకుబరువై అవమానాలకుగురై
ఆత్మహత్యలు చేసుకోక తప్పదు

అందుకే మందు...విందు...పొందు అంటూ
ఖర్చుచేసే...ముందు...కాస్త ఆలోచించాలి  
ఇది అనుభవగ్నుల...ఆత్మఘోష అమరసందేశం

అతిగా ఖర్చు చేసేవారు అవివేకులు
ధనాన్ని వృధా చేసేవారు దరిద్రులు
కొద్దికొద్దిగా పొదుపు చేసేవారే కోటీశ్వరులు
ఇది మన ఇంటిపెద్దల...మంచిమాట సద్దిమూట

ఆదాయం - ఖర్చు = పొదుపు
అన్న సూత్రం కన్న
ఆదాయం - పొదుపు = ఖర్చు
అన్న సూత్రం మిన్న అని గుర్తించి
పక్కాగా పాటించేవారే పై కెదుగుతారు
పదికాలాలపాటు పచ్చని చెట్లలా బ్రతుకుతారు
ఇది ఆరితేరిన ఆర్థిక నిపుణుల...అంతరంగమధనం

ఈ ఆర్ధిక సూత్రాలు ఎరిగినవాళ్ళు అందరికి దేవుళ్ళే
ఖర్చుల్ని అదుపు చేయకున్న కడకుమిగిలేది కన్నీళ్ళే