నిన్న వాళ్ళు...అన్నాతమ్ముళ్ళు
అందరిలో అనురాగాలే ఆప్యాయతలే
ప్రాణానికి ప్రాణం ఇచ్చుకునే రక్తసంబంధాలే
కానీ నేడు వాళ్ళు...బద్ధశత్రువులు
కారణమొక్కటే...అమ్మానాన్నల "ఆస్తుల పంపకం"
నిన్న వాళ్ళు...ప్రాణస్నేహితులు
అందరినీ లతలా పెనవేసుకున్న
పేగుబంధాన్ని మించిన స్నేహంబంధం
ఆపదలో ఆదుకున్నారు అవసరాలు తీర్చుకున్నారు ప్రాణానికి ప్రాణం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమన్నారు
కానీ నేడు...వాళ్ళు బద్దశత్రువులు
కారణమొక్కటే...కోరుకున్న అమ్మాయిమీద కోటిఆశలు
నిన్నవాళ్ళు...వ్యాపారంలో భాగస్వాములు
ఒకరంటే ఒకరికి ప్రాణమే అభిమానమే గౌరవమే
మనసు విప్పి మాట్లాడుకునేవారు
స్నేహపూర్వకమైన చర్చలు జరిపేవారు
కష్టనష్టాలను కలిసి సమంగా భరించేవారు
కానీ నేడు వాళ్ళు...బద్ధశత్రువులు
కారణమొక్కటే...లాభాల పంపకాల్లో మనస్పర్థలు
వ్యాపారం అభివృద్ధిచెంది భాగస్వామ్యం భగ్గుమన్నది
అసూయా ద్వేషం పగాప్రతీకారాలతో రగిలిపోతున్నారు
ఒకరిని మరొకరు కిడ్నాప్ చేసి కిరాయి గూండాలతో
హత్య చేయించడానికి రక్తాన్ని రుచిచూడడానికి
అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దమౌతున్నారు
ఔను మనకిప్పుడు కావాలసింది బంధాలు కాదు
బాధలు పంచుకనే...మనస్తత్వం...మచ్చలేని వ్యక్తిత్వం
మంచితనం...మానవత్వం...సహనం...సర్దుబాటుగుణం
ముఖాముఖి చర్చలకు...ముందుండడం
గతంలోని చేదుజ్ఞాపకాలను...మరిచిపోవడం
తీపిజ్ఞాపకాలను నిత్యం...గుర్తుచేసుకోవడం
మూడో వ్యక్తి...ప్రమేయం లేకుండా ఉండడం
ఒకరిమీద ఒకరు పూర్తి విశ్వాసం...కలిగిఉండడం
ఇవే ప్రధానమైన సుగుణాలు...సుఖజీవనసూత్రాలు
ఇవే అనుబంధాలకు...భవబంధాలకు...ఆభరణాలు
మరిచిపోలేని మానసికబంధాలకు మంగళతోరణాలు



