Facebook Twitter
ఓ కన్నతల్లి ప్రార్థన?

ఓ దైవమా! 
కడుపుపండి కదలలేకున్నా
కదిలేబిడ్డ లోన కాళ్లతో తన్నుతున్నా
బరువైనా భారమైనా సరే 
తొమ్మిదినెలలు బిడ్డను భరించాను
నరకయాతన కన్న మిన్నైన
ఆ ప్రసవవేదనను సహించాను
నవమాసాలు మోసి నా రక్తాన్ని
పంచిబిడ్డను కన్నానని నేననుకున్నాను

కాని కడుపులోవున్న పసికందుకు
జీవంపోసి జన్మనిచ్చింది 
కనేభాగ్యం నాకు కల్పించింది
నాకు సైతం తిరిగి పునర్జన్మ నిచ్చింది 
మీరేనన్న నగ్నసత్యం నాకు తెలిసింది

అందుకే ఓ దైవమా !
నాదొక విజ్ఞాపన నన్ను ఏక్షణమైనా 
మీచెంతకు చేర్చుకోండి కాని నాబిడ్డకు మాత్రం
"నిండునూరేళ్ళ ఆయుష్షును"
"ప్రశాంతమైన జీవితాన్ని" ప్రసాదించండి తండ్రీ! 

అందుకే అంటారు అనుభవగ్నులు
అమ్మమాట‌ "అమృతమని"
అమ్మంటే కనిపించే ఒక "దేవతని" 
ఎన్నిజన్మలెత్తినా
తీర్చుకోలేనిది "అమ్మ ఋణమని"

ఆ మాతృమూర్తికి ఆ పసిబిడ్డంటే "పంచప్రాణాలు"
ఆ భర్తంటే "గౌరవం" ఆ భగవంతుడంటే "నమ్మకం"