ఒకరితో ఒకరు
సరదాగా మాట్లాడుకోవాలి
ఆప్యాయతతో అనురాగముతో
ప్రేమతో మాట్లాడుకోవాలి అంతేకానీ
పెద్దగొంతుతో మాట్లాడుకోకూడదు
కాకుల్లా అరవకూడదు పొడవకూడదు
కుక్కల్లా మొరగకూడదు కరవకూడదు
ఎత్తిపొడుపు మాటలు మాట్లాడకూడదు
మనసు కళుక్కుమనేలా
కత్తులతో పొడిచినట్లుగా
సూదులతో గుచ్చినట్లుగా
పుండు మీద కారం చల్లినట్లుగా
సూటిపోటి మాటలు మాట్లాడకూడదు
ఒకరినొకరు పురుగులా చూడకూడదు
ఎదురుపడితే ఛీ అంటూ మూతి
ముడుచుకోకూడదు ముఖంతిప్పుకోకూడదు
నంగనాచిలా నటించకూడదు
వెకిలిగా నవ్వకూడదు వేధించకూడదు
పొద్దస్తమానం పోట్లాడుకోకూడదు
జుట్టు పట్టుకుని కొట్లాడుకోకూడదు
విడిపోదాం విడిపోదాం విడిపోదాం
విడాకులు తీసుకుందాం అని
పదేపదే అదేపనిగా అనకూడదు
అవమాన పరచకూడదు
మదిలో రగిలే అపార్ధాల మంటలు
ఆరవని అనుమాన పడకూడదు
కలిసి ఉండలేం కాపురం చెయ్యలేం
అతకని మనసులతో
ఈ గతుకుల బ్రతుకుబండిని లాగలేం
మధ్య అడ్డుగోడలు కట్టుకుందాము
దూరంగా సుదూరంగా వెళ్లిపోదాం
కలిసి ఉంటే కాదు, సుఖముశాంతి
విడిపోతేనే అని దంపతులందరికీ
విడమరచి చెబుదాం



