
గడపలో వాలు కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్న సీతారాం గారి ఇంటి ముందు మంచినీళ్ల బాటిల్స్ వ్యాన్ ఆగింది. ఒక కుర్రాడు వచ్చి ఇరవై లీటర్లున్న బాటిల్ అరుగు మీద పెట్టి వెళ్లిపోయాడు.
సరిగ్గా అప్పుడే ఇంటర్ ట్యూషన్ నుంచి తిరిగొచ్చి దొడ్లో అడుగుపెట్టిన కొడుకు కనబడ్డాడు సీతారాంకి.
నీళ్ల బాటిల్‌ను లోపల పెట్టమని కొడుక్కి చెప్పాడాయన.
‘అలాగే’ అనేసి నీళ్ల బాటిల్ ని సమతలంగా ఉన్న గచ్చు మీద ఉంచి , రెండు కాళ్ల మధ్య బాటిల్ ను ఉంచి దొర్లించుకుంటూ తీసుకెళ్ళసాగాడు కొడుకు.
తలెత్తి చూసిన సీతారాంకి కొడుకు కాళ్ల మధ్య బాటిల్ దొర్లించడం కనబడింది.
చదువుతున్న పేపర్ పక్కన పడేసి కొడుకు దగ్గరకెళ్లి ఆగమని చెప్పాడు సీతారాం. ఆ వాటర్ బాటిల్ ని రెండు చేతులతో పైకెత్తి మోసుకుని వంటగదిలో చేర్చాడు ఆయన.
“నేను తీసుకెళుతున్నాను కదా. మళ్ళీ మీరొచ్చారేం” అనడిగాడు కొడుకు.
“ప్రాణులకు జీవాధారం నీళ్లు. అవి లేనిదే మనం బ్రతకలేం. పంచభూతాల్లో నీరు కూడా ఒక్కటని తెలియదా? అలాంటి మంచి నీళ్ళని గౌరవించాలి. కాళ్ళ మధ్య దొర్లిస్తూ అవమానించకూడదు. అందుకే రెండు చేతుల మధ్య పెట్టుకుని మోసాను” అని చెప్పాడు సీతారాం.
“అలాగా! అయితే వర్షం పడుతున్నప్పుడు నీటిలో నడుస్తాం. కాళ్లతో తొక్కుతాం. అది తప్పు కాదా? “అనడిగాడు కొడుకు.
“మనం తినే ఆహారాన్ని, త్రాగే నీటిని పూజ్య భావంతో చూడాలి. నువ్వు చదివే పుస్తకాలను కూడా పూజ్య భావంతోనే చూడాలి. కాలితో తన్నకూడదు. అందుకే నీ తప్పు నీకు తెలిసేలా చెప్పాను. ఇక వర్షం సంగతంటావా? వర్షపు నీటిలో కాళ్ళు వేసి నడవడం మనం కావాలని చేయడం లేదు. అక్కడ మరొక ప్రత్యామ్నాయం లేదు. మనం నీటిలో పడుకుని ఈదుతూ వెళ్లేంత నీరు ఉండదు కాబట్టి నడిచి వెళ్ళడం తప్ప మరేం చేయలేము. ఇకముందు నీళ్ల బాటిల్ నేను తీసుకెళ్ళినట్టే మోసుకుని మాత్రమే వెళ్ళాలి. ఆ అలవాటు చేసుకోవడం మంచిది” చెప్పాడు సీతారం.
‘అలాగే నాన్నా’ అని బుద్ధిగా తలూపాడు కొడుకు.



