Facebook Twitter
దివ్యస్త్రోత్రం

ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు. 
నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. 
ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. 
స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. 
ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు. 
‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు. 
ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు.        రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.

‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు.       ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు.
‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.
బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది. 
సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు. 
బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.