Facebook Twitter
వైజయంతి నిర్ణయం(చందమామ కథ)

వినుకొండరాజు నరేంద్రుడి ఏకైక కుమార్తె వైజయంతి. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను తండ్రి అల్లారుముద్దుగా పెంచి రాజోచితవిద్యలు నేర్పించాడు. యుక్తవయస్కురాలైన వైజయంతిని చక్కని రాజకుమారుడికిచ్చి త్వరలో వివాహం జరిపించే ఆలోచనలో ఉన్నాడు నరేంద్రుడు. వైజయంతి ఒకనాడు తన చెలికత్తెలతో కలిసి తూరుపు కొండమీది రాజేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళింది. చెలికత్తెలు బయట వేచి ఉండగా ఆమె మాత్రం లోపలి ఆలయంలో దేవీ దర్శనం ముగించుకుని, గుడి వెనుక వైపుకు యథాలాపంగా వచ్చింది. అక్కడ ఒక యువకుడు బండరాయి మీద నర్తకి శిల్పం చెక్కుతున్నాడు. యువరాణి ఆ శిల్పాన్నీ, దాన్ని తదేకంగా చెక్కుతున్న శిల్పినీ చూసి సంతోషించి, "అద్భుతం! శిల్పం చాలా అందంగా ఉన్నది,'' అంటూ శిల్పిని సమీపించింది. ఆ మాటకు యువకుడు తలెత్తి చూశాడు ఎవరా అన్నట్టు. "నేను యువరాణి  వైజయంతిని,'' అన్నది యువరాణి. "నమస్కారం యువరాణీ! నా పేరు విశాలుడు,'' అన్నాడు యువశిల్పి వినయంగా. "నీ శిల్ప నైపుణ్యం అత్యద్భుతం. నీతో నా శిల్పం చెక్కించుకోవాలనుకుంటున్నాను,'' అన్నది వైజయంతి. "ఆ అవకాశాన్ని గొప్ప వరంగా భావిస్తున్నాను. పాలరాతితో మీ సుందర శిల్పం చెక్కుతాను. నెలరోజులు పట్టవచ్చు. అందుకు వారానికి ఒకసారి ఒక గంటసేపు మీరు నా ఎదుట నిలబడవలసివుంటుంది,'' అన్నాడు విశాలుడు.

"మరి ఆలస్యం దేనికి? త్వరలోనే ప్రారంభించు. అయితే, శిల్పం పూర్తయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగా ఉండాలి,'' అన్నది వైజయంతి ఉత్సాహంగా. విశాలుడు కొండకు దిగువన కొబ్బరి చెట్ల మధ్యవున్న ఒక పెంకుటిల్లును చూపిస్తూ, "అదే మా ఇల్లు. మా అవ్వ నాతో పాటే ఉంటుంది. శిల్పం విషయం రహస్యంగా ఉండాలంటున్నారు. మరి, మీరు మా ఇంటికి రాగలరా?'' అని అడిగాడు. "ప్రతి శుక్రవారం రాజేశ్వరీదేవీ ఆలయానికి వస్తాను. దర్శనం ముగించి, కొండదిగి మీ ఇంటికి వస్తాను,'' అని చెప్పి వెళ్ళింది వైజయంతి. మరుసటి శుక్రవారం వైజయంతి, దేవిని దర్శించుకుని కొండదిగి విశాలుడి ఇంటిని సమీపించింది. చెట్ల మధ్య ఒక తిన్నె మీద పాలరాతిని అమరుస్తున్న విశాలుడు, "రండి, మీ కోసమే ఎదురు చూస్తున్నాను,'' అని యువరాణిని గౌరవంతో ఆహ్వానించాడు.

ఆ తరవాత వైజయంతి విశాలుడు చెప్పినట్టుగా పక్కనే వున్న ఒక చెట్టును ఆనుకుని మాధవీలతను సవరిస్తూ నిలబడింది. ఏకాగ్రతతో విశాలుడు పాలరాతిపై ఆమె రేఖా చిత్రాన్ని చిత్రించాడు. విశాలుడు, "చాలు. ఇక ఇలా వచ్చి కూర్చోండి," అంటూండగా, ఇంటి లోపలి నుంచి అవ్వ అరిటాకులో వేడి వేడి అరిసెలు తీసుకువచ్చి ఇచ్చింది. వైజయంతి అరిసెలను ఏనాడూ తినలేదు. వాటి రుచి బాగానచ్చి, వాటి పేరు అడిగి తెలుసుకుని, "ఇక మీదట నిన్ను `అరిసెల అవ్వా,' అని పిలుస్తాను. సరేనా?'' అన్నది వైజయంతి నవ్వుతూ. "మాలాంటి పేదల ఇంటికి రావడమే కాకుండా, వరస కూడా కలిపావు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లీ," అంటూ చేతులు జోడించింది అవ్వ. విశాలుడు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్ల మూడు వారాలలోనే శిల్పం దాదాపు పూర్తయింది. ఒకరోజు సాయంకాలం దానిని చూడడానికి వచ్చిన వైజయంతితో, "ఇక తుది మెరుగులు మాత్రమే దిద్దవలసి ఉన్నది. మరో నాలుగురోజుల్లో మీరు శిల్పాన్ని తీసుకువెళ్ళవచ్చు," అన్నాడు విశాలుడు. వైజయంతి తన శిల్పాన్ని తనివితీర చూసుకుని సంతోషంగా వెనుదిరిగింది.

మరునాటి ఉదయం ఉద్యానవనంలో తిరుగుతూన్న వైజయంతి, నిండుగా పూచిన గులాబీని అందుకోబోతూ, "మీ సౌందర్యం అపూర్వం, యువరాణీ!" అన్న మాటలు వినిపించి తలెత్తి చూసింది. ఆమెకు కొద్ది దూరంలో ఒక క్షత్రియ యువకుడు కనిపించాడు. దేశాటనలో వున్న కొండవీటి యువరాజు జయంతుడు ఆరోజు తమ అతిథిగా వస్తున్నాడని క్రితం రాత్రి తండ్రి చెప్పడం గుర్తుకు వచ్చింది వైజయంతికి. "మీరు మా అతిథిగా రావడం మాకెంతో సంతోషం కలిగించింది," అంటూ వైజయంతి దూరంగా ఉన్న తోటమాలిని పిలిచి, జయంతుడికి ఉద్యాన వనమంతా చూపించమని చెప్పి, తన అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నరేంద్రుడు వైజయంతితో, "అమ్మా, నువ్వు జయంతుడికి ఎంతగానో నచ్చావట. నిన్ను చూసిన క్షణమే నిన్నే వివాహ మాడాలని నిశ్చయించి, నిన్ను చూడడానికి త్వరలో తన తల్లిదండ్రులను పంపుతానన్నాడు. నీ అభిప్రాయం ఏమిటి తల్లీ," అన్నాడు. "జీవితంలో వివాహం చాలా ముఖ్యమైనదికదా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి, నాన్నా,'' అన్నది వైజయంతి. మరునాడు తెల్లవారక ముందే ఒక చెలికత్తె వచ్చి, "కోట గుమ్మం దగ్గర ఒక ముసలిసిది మీ దర్శనార్థం వేచి ఉన్నది. అరిసెల అవ్వ అట!" అన్నది వైజయంతితో. "లోపలికి తీసుకురా," అని ఆజ్ఞాపించిన వైజయంతి, ఆమె రాగానే, తన ఆంతరంగిక మందిరంలోకి తీసుకుపోయి, "ఆ కన్నీళ్ళేమిటి, అవ్వా? అసలు ఏం జరిగింది?" అని అడిగింది ఆందోళనతో.

అవ్వ ఆ క్రితం సాయంత్రం తమ ఇంట జరిగిన విషయం పూసగుచ్చినట్టు వివరించింది: కొండవీటి యువరాజు జయంతుడు తన పరివారంతో తిరిగి వెళుతూ మంచి నీళ్ళ కోసం విశాలుడి ఇంటి ముందు ఆగాడు. విశాలుడి అవ్వ అందరికీ తాగడానికి మజ్జిగ ఇచ్చింది. బయలుదేరే ముందు జయంతుడు, "ఇదేమిటి?" అంటూ వైజయంతి పాలరాతి శిల్పం మీది వస్త్రాన్ని, తన కత్తితో పక్కకు తొలగించాడు. అతిమనోహరంగా ఉన్న వైజయంతి శిల్పాన్ని చూడగానే జయంతుడు ఆగ్రహోదగ్రుడై, "ఈ జయంతుడికి కాబోయే భార్య శిల్పాన్ని ఇక్కడ ఉంచుకోవడానికి ఎంత ధైర్యం? నా హృదయపీఠంపై కొలువుండే యువరాణి శిల్పాన్ని ఇక్కడ నిలబెట్టిన ద్రోహి ఎవరు?" అని గద్దించి అడిగాడు. "ఆ శిల్పాన్ని నేనే చెక్కాను," అన్నాడు విశాలుడు వినయంగా. "ఎలా చెక్కావు? యువరాణిని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చూశావు?" అని నిలదీశాడు జయంతుడు. విశాలుడు బదులు పలకకుండా మౌనం వహించాడు. జయంతుడు తల తిప్పి తన అంగరక్షకుడి కేసి చూశాడు. మరుక్షణమే వాడు విశాలుణ్ణి ఎడాపెడా కొరడాతో కొట్టసాగాడు. కాని అతడు మాత్రం నోరు విప్పలేదు. జయంతుడు పట్టరాని ఆగ్రహంతో, శిల్పాన్ని కింద పడదోసి ముక్కలుగా విరగకొట్టి, "ఈ దుర్మార్గుణ్ణి అన్న పానీయాలు లేకుండా వీడి ఇంట్లోనే బంధించండి," అని ఆజ్ఞాపించి ఇద్దరు భటులను కాపలా ఏర్పాటు చేశాడు. కాళ్ళ మీద పడి అవ్వ ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా కాలితోనే ఆమెను పక్కకు తోసి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. "నిన్న సాయంకాలం నుంచి వాడు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. మీరే వాణ్ణి కాపాడాలి," అంటూ వైజయంతికి చేతులెత్తి మొక్కింది అవ్వ. ఆమె మాటలను విన్న వైజయంతి, "నువ్వేమీ భయపడకు. విశాలుడికి ఎలాంటి ఆపదా రాదు," అంటూండగా రాజు వైజయంతిని చూడడానికి అక్కడికి వచ్చాడు. వైజయంతి తండ్రికి జరిగినదంతా వివరించి, "మీకు తెలియకుండా నా శిల్పం చెక్కించుకున్నందుకు నన్ను క్షమించండి. జన్మదిన కానుకగా మీకు ఇచ్చి సంభ్రమం కలిగించాలని ఆ విషయం గోప్యంగా ఉంచాను. నా శిలావిగ్రహం వేరొక చోట ఉండడం చూసి అది అక్కడ ఎందుకు ఉందన్న పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆగ్రహం చెంది తన రాజ్యానికి చెందని ఒక నిరపరాధిని కఠినంగా శిక్షించాడు జయంతుడు. అతని ప్రవర్తన నా పట్ల ప్రేమకన్నా, నేను అతనికే దక్కాలన్న మితి మించిన స్వార్థం, అహంకారాలను తెలియజేస్తున్నది. ఇక విశాలుడు శిల్పం చెక్కే విషయం రహస్యంగా ఉంచాలని చెప్పిన నా మీది గౌరవం కొద్దీ ప్రాణం మీదికి వచ్చినా పెదవి విప్పలేదు. మాట తప్పని గుణం, ఓర్పు, నేర్పు, శ్రద్ధ, శాంతం ఏపాలకుడికైనా ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అవన్నీ విశాలుడిలో ఉన్నాయి. నేను జయంతుణ్ణి వివాహ మాడితే మన రాజ్యం కొండవీటిలో కలిసిపోయి, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. విశాలుణ్ణి చేసుకుంటే వినుకొండ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అందువల్ల మీరు అనుమతిస్తే విశాలుణ్ణి వివాహ మాడదలిచాను," అన్నది. అంతా విన్న నరేంద్రుడు తలపంకిస్తూ, " ఆలోచించాకే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకుంటావని నాకు తెలుసు. అయినా, ఆలోచించడానికి నాకూ కొంత సమయం కావాలి," అన్నాడు.

అక్కడే నిలబడివున్న అవ్వ, "ఇన్నాళ్ళు నా కడుపులో దాచుకున్న ఒక రహస్యం చెప్పవలసిన సమయం వచ్చిందను కుంటాను. విశాలుడు నా సొంత మనవడు కాదు. గుర్రంకొండ రాజును దాయాదులు కుట్రతో హతమారిస్తే, రాణిగారు ఆరునెలల పసిబిడ్డను నా కప్పగించి కన్నుమూసింది. శత్రువుల నుంచి అతడికి ఎలాంటి ఆపదా రాకూడదని రాణిగారికిచ్చిన మాట కారణంగా, ఆ రాజ్యం వదిలి వచ్చినా, ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని విశాలుడికి కూడా చెప్పలేదు. ఇకపై అతడి రక్షణాభారం మీదే,'' అన్నది అవ్వ. "ఏమిటీ! విశాలుడు గురుకులంలో నా సహాధ్యాయి అయిన గుర్రంకొండ రాజు భూపాలుడి కుమారుడా?" అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైన రాజు, కుమార్తె కేసి తిరిగి, "వైజయంతీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఒక సామాన్య శిల్పికిచ్చి వివాహం చేయడమా అన్న సందిగ్థంలో పడి వెనుకాడాను. ఇప్పుడతడు సకల సద్గుణ సంపన్నుడైన నా బాల్యమిత్రుడి కుమారుడని తెలిసిపోయింది. ఇంకేం. నిరభ్యంతరంగా నీకు నచ్చిన విశాలుణ్ణి పరిణయమాడవచ్చు," అన్నాడు. వైజయంతి ఆప్యాయంగా తండ్రిని చూస్తూ మందహాసం చేసింది.