Facebook Twitter
వందకు ఒకటి తక్కువ! (చందమామ కథ)

చందన్‌, నందన్‌ ఇరుగుపొరుగున నివసించేవారు. చందన్‌ ధనిక వర్తకుడు. కాని నందన్‌ పొద్దున లేచి వెళ్ళి కాయకష్టం చేస్తే తప్ప పూట గడవని పేదవాడు. చందన్‌కు అన్నిసంపదలూ ఉన్నప్పటికీ అవసరాలకు మించి దమ్మిడీ ఖర్చు పెట్టడు. వాళ్ళ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నందన్‌ భార్య చారుమతికి బంధుమిత్రులంటే మహా ప్రీతి. అందువల్ల తరచూ వాళ్ళ ఇల్లు బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడుతూ ఉండేది.

అతిథులకని ఆమె ప్రత్యేక వంటలు తయూరు చేసేది కాదు. కాని ఆమె చేసిన వంటలను అందరూ ఇష్టపడి తినేవారు. నందన్‌ ఇంట్లో బంధుమిత్రుల సందడి, వాళ్ళు భోజనం చేసేప్పుడు చెప్పుకునే ఉత్సాహపు కబుర్లు విని పొరుగున ఉన్న చందన్‌, అతడి భార్య పరమేశ్వరి ఆశ్చర్యపడేవారు. నందన్‌ సంపాదించే తక్కువ డబ్బులతో వాళ్ళెలా అతిథులకు భోజనాలు పెట్టగలుగుతున్నారా అని విస్తుపోయేవారు. పరమేశ్వరి, చారుమతి కూడా మంచి మిత్రులు. చారుమతి, ఆమె భర్త తక్కువ ఆదాయంతో అంత హాయిగా బంధుమిత్రులతో ఎలా జీవించ గలుగుతున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహం పరమేశ్వరిలో కలిగింది. ఒకనాడు మాటల సందర్భంలో ఆ విషయం ప్రస్తావించింది.

ఆ మాట వినగానే చారుమతి చిన్నగా నవ్వి, ‘‘మా ఆయన వేళకు అంతమంది అతిథులను ఎలా పిలుచుకు వస్తాడో నిజానికి నాకూ తెలియదు. ఉన్నట్టుండి భోజనానికి ఎంత మంది వస్తున్నారో చెబుతాడు. ఇంట్లో ఉన్నవాటితో వంట సిద్ధం చేస్తాను. అంతే. అంతకు మించి నాకేమీ తెలియదు. బహుశా తెలివైన వర్తకుడు గనక, మీ ఆయనే నీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలడనుకుంటాను,'' అన్నది. పరమేశ్వరి కొన్ని రోజులు ఆగి సరైన సమయం చూసి తనకూ, చారుమతికీ మధ్య జరిగిన సంభాషణ గురించి భర్తకు చెప్పింది. ఆమె ప్రశ్నకు సమాధానం తెలిసిన వాడిలా నవ్విన చందన్‌, ‘‘నీ స్నేహితురాలికీ, ఆమె భర్తకూ తొంభై తొమ్మిది శక్తి అనుభవం లేదు గనక, నిశ్చింతగా హాయిగా బతికేస్తున్నారు. ఒక్కసారి ఆ అనుభవం కలిగితే చాలు. వాళ్ళ జీవన విధానమే ఎదురు చూడనంతగా మారిపోగలదు,'' అన్నాడు. ‘‘తొంభై తొమ్మిది శక్తి అనుభవమా? ఏమిటండీ అది?'' అని అడిగింది పరమేశ్వరి విస్మయంతో. ‘‘ఇప్పుడు దాన్ని అంత సులభంగా వివరించడానికి లేదు. అయితే, ఏం జరుగుతుందో చూసి త్వరలో నువ్వే గ్రహించగలవు,'' అంటూ ఆ విషయాన్ని అంతటితో ముగించాడు చందన్‌.

మహేశ్వరి ఆ తరవాత కొన్నాళ్ళ పాటు పొరుగింటి భార్యాభర్తలను గురించి ఆలోచించడం మానేసింది. అయితే, కొన్నాళ్ళుగా పక్కఇంటి నుంచి అతిథుల సందడి తగ్గిపోవడం గమనించి ఆశ్చర్యపోయింది. పైగా, భార్యా భర్తలు ఎప్పుడు చూసినా తుంగ చాపలు అల్లడంలో నిమగ్నులై కనిపించారు. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక వారిలో వేళ్ళూనిందన్న మాట. ఇవన్నీ ఆలోచిస్తూంటే మహేశ్వరి మనసు ఊరుకోవడం లేదు. మామూలుగా మధ్యాహ్న సమయంలో పిచ్చాపాటీ మాట్లాడడానికి వచ్చే చారుమతి ఇప్పుడు రావడం మానేసింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో, చందన్‌ లేని సమయం చూసి ఒక నాటి మధ్యాహ్నం వేళ ఆమె చారుమతిని చూడడానికి వెళ్ళింది. పరమేశ్వరిని చూడగానే చారుమతి లేచివచ్చి ఆప్యాయంగా పలకరించి, తీసుకు వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని చాప అల్లుతూ మాట్లాడసాగింది. కుశల ప్రశ్నలు అయ్యాక, ‘‘అవునూ, మా ఇంటికి రావడం సాంతం మానేశావేమిటి చారుమతీ? నువ్వూ, మీ ఆయనా ఎప్పుడు చూసినా చాపలల్లుతూ ఉన్నారు కదా! మీ ఆయనకు బయట పనులు దొరకడం లేదా ఏం?'' అని అడిగింది పరమేశ్వరి.

చారుమతి తలెత్తి, ‘‘అదేం లేదు పరమేశ్వరీ. నేనూ, మా ఆయనా మా జీవన విధానాన్ని మార్చుకో వాలనుకున్నాం. అంతే,'' అన్నది. పరమేశ్వరి ఆమె మాటలు నమ్మలేకపోయింది. ఆమె తన నుంచి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానించింది. ‘‘నేనిలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోకు. డబ్బులకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇస్తాను. మీ కష్టాలు తీరడానికి నేను సాయపడతాను. ఆ సంగతి మా ఆయనకు తెలియనివ్వను. నువ్వూ మీ ఆయనకు చెప్పనవసరం లేదు,'' అన్నది ఆప్యాయంగా.
తన స్నేహితురాలి నుంచి అంతటి కనికరాన్ని ఎదురుచూడని చారుమతి, ‘‘అలాంటిదేం లేదు, మహేశ్వరీ. మా ఆయనకు కావలసినంత పని దొరుకుతోంది. పైగా, తన సంపాదనను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు,'' అన్నది. ‘‘ఎందుకని? ఆ అవసరం ఎందుకు వచ్చింది?'' అని అడిగింది పరమేశ్వరి.

చారుమతి ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, ‘‘సరే, ఆ సంగతి నీకు చెబుతాను. అయితే, దాన్ని నువ్వు మీ ఆయనకు కూడా చెప్పకూడదు. సరేనా,'' అన్నది. ‘‘చెప్పను. నిజం!'' అన్నది పరమేశ్వరి. ‘‘కొన్నాళ్ళ క్రితం మా ఆయన పనికి వెళ్ళి తిరిగివస్తూ మా ఇంటి గుమ్మం ముందు మూతి బిగువుగా కట్టిన చిన్న సంచీని చూశాడు. దాన్ని తీసుకుని లోపలికి వచ్చి కిటికీ దగ్గర పెడుతూండగా గలగలమని నాణాల శబ్దం వినిపించింది. మా ఆయన సంచీ మూతివిప్పి నాణాలను నేలపై కుమ్మరించాడు. అవి నిగనిగలాడే వెండి నాణాలు. లెక్కపెడితే తొంభైతొమ్మిది నాణాలున్నాయి. మళ్ళీ లెక్కపెట్టాడు. ‘చారుమతీ, మొత్తం ఎన్ని ఉన్నాయో చూడు,' అంటూ నన్ను పిలిచాడు. నేను లెక్కపెట్టినా తొంభైతొమ్మిదే ఉన్నాయి. ‘వందకు ఒక్కనాణెం ఎందుకు తగ్గుతున్నది?' అని నన్ను అడిగాడు. ‘ఎందుకు తగ్గింది? ఎందుకు ఒక నాణెం తక్కువ? అని కొంత సేపు తర్జన భర్జన పడ్డ మా ఆయన హఠాత్తుగా ‘ఏం చేయాలో నాకు తెలుసు,' అంటూ ఆ రోజు తను సంపాదించిన దానిలో నుంచి ఒక నాణెం తీసి ఆ సంచీలో వేసి, మూతి బిగించి, పక్కన పెట్టాడు,'' అన్నది చారుమతి. ‘‘ఆ తరవాత ఏమయింది?'' అని అడిగింది పరమేశ్వరి. ‘‘ ఆ తరవాత మా ఆయన రోజూ ఒక నాణాన్ని సంచీలో వేయాలని నిర్ణయించాడు. ఆ క్షణమే పొదుపు చేయడం ప్రారంభించాం. కొన్ని రోజులు పనికి వెళ్ళ కుండా ఇంటి పట్టునే ఉండి చాపలల్లడం మొదలు పెట్టాడు. ఆ విధంగా మరింత ఆదాయం రాసాగింది. దాన్ని సంచీలోని నాణాలతో చేర్చసాగాము,'' అని ఆగింది చారుమతి. ‘‘బావుంది కానీ, మీ బంధుమిత్రుల హడావుడి ఇప్పుడు కొన్నాళ్ళుగా కనిపించడం లేదే! వాళ్ళకేమయింది?'' అని అడిగింది పరమేశ్వరి. ‘‘అదా! వాళ్ళిప్పుడు మా ఇంటికి రావడం లేదు.అందుకు కారణం మేము వారిని పిలవకపోవడం కాదు. కొందరు ఊరు వదిలి వెళ్ళారు. మరి కొందరు మేము ఎప్పుడూ పనుల మీద ఉండడం చూసి ఇటువైపు రావడం తగ్గించారు,'' అన్నది చారుమతి.

‘తొంభైతొమ్మిది' తమ పొరుగు కుటుంబంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో పరమేశ్వరికి ఇప్పుడు అర్థమయింది. అయినా, ఆమె తన స్నేహితురాలికి ఇచ్చిన మాటను నిలుపుకుని, ఆ సంగతిని తన భర్తకు చెప్పలేదు.
అయినా, అదృష్టవశాత్తు ఆమె భర్తకు పొరుగింటి వారిని గురించి ఆలోచించేటంతటి తీరిక సమయం లేదు. తెలివైనవాడు గనక-తమ పొరుగువారి జీవన విధానంలో మార్పు రావడానికి తనే బాధ్యుడన్న రహస్యాన్ని బయటపెట్ట కూడదని నిర్ణయించాడు. చందన్‌ నందన్‌ మంచి మిత్రులుగా కొనసాగారు. చందన్‌ దాచిన రహస్యం ఏమిటో మీరు ఊహించగలరా?