Facebook Twitter
మనసు బుద్ధి

మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది. భవబంధాలకు మోక్షానికి, రాగానికి ద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు. మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు.

మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు బుద్ధి అదుపులో మనసు ఉండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కాని, అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు. మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. మనసు మాయాజాలం మాటలకు అందనిది. మయుడి సభను మరపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపజేస్తుంది మురిపిస్తుంది. బుద్ధి ఉపయోగించి గాని ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు.

మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహాప్రపంచాన్ని సృష్టిస్తుంది.. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్న మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలేవారు నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు. కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు. కొందరు తమ బాధ్యతను కర్తవ్యాన్ని భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైనా భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి. అప్పుడే వాటికి సార్థకత.

మనిషి బలం, బలహీనత... రెండూ మనసే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే. రాక్షసుడిగా దిగజార్చేది మనసే. బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. మనసూ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది. మనసులోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలూ దగ్గరకు రావు. నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్నవారికి రోగాలు దరిచేరవని ధ్రువీకరిస్తున్నారు. ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు ప్రలోభాలు సంఘటనలను అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించు కోవాలి. అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి.